IPL Mega Auction: చేతిలో సుత్తితో ఐపీఎల్ వేలం నిర్వహించనున్న అమ్మడు.. అసలు ఎవరీ మల్లికా సాగర్?
- ఐపీఎల్ మెగా వేలాన్ని నిర్వహించనున్న మహిళా ఆక్షనీర్ మల్లికా సాగర్
- వేలం నిర్వహణలో అపార అనుభవం సంపాదించిన ముంబై వాసి
- ఆధునిక భారతీయ కళాఖండాలపై నైపుణ్యం ఉన్న కన్సల్టెంట్‌గా గుర్తింపు
ఐపీఎల్-2025 మెగా వేలానికి సమయం ఆసన్నమైంది. సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా ఇవాళ, రేపు (ఆది, సోమ) ఆటగాళ్ల వేలం కొనసాగనుంది. సాయంత్రం 3.30 గంటల నుంచి ప్రక్రియ జరుగుతుంది. ఈసారి వేలంలో మొత్తం 577 మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇందులో 367 మంది భారత ఆటగాళ్లు, 210 మంది విదేశీ ప్లేయర్లు ఉన్నారు. కాగా ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు, విశ్లేషకులు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న ఈ మెగా వేలాన్ని మల్లికా సాగర్ అనే మహిళా ఆక్షనీర్ (వేలం నిర్వహించే వ్యక్తి) నిర్వహించారు. వందలాది క్రికెటర్ల తలరాతను నిర్ణయించే వేలాన్ని నిర్వహిస్తోన్న ఆమె ఎవరు?.. అని తెలుసుకునేందుకు క్రికెట్ అభిమానులు ఆసక్తి చూపుతున్నారు.
మల్లికా సాగర్ ముంబైకి చెందినవారు. ఆమె ఒక ఆర్ట్ కలెక్టర్. అంటే కళాఖండాలను సేకరిస్తుంటారు. ఆధునిక భారతీయ శిల్పకళలపై నైపుణ్యం ఉన్న కన్సల్టెంట్‌గా ఆమె విశిష్ట గుర్తింపు పొందారు. ముంబైకి చెందిన ఆక్షన్ కంపెనీ ‘పుండోల్స్’కు సంబంధించిన వేలం పాటలను నిర్వహించడం ద్వారా ఆమె అపారమైన అనుభవాన్ని పొందారు. క్రీడారంగానికి సంబంధించిన వేలంపాటలు నిర్వహించడం మల్లికకు కొత్తేమీ కాదు. గతంలో పలు వేలాలను ఆమె విజయవంతంగా నిర్వహించారు.
ఐపీఎల్ 2024 మినీ-వేలంలో హ్యూ ఎడ్మీడ్స్ స్థానంలో మల్లికా బాధ్యతలు చేపట్టారు. ఐపీఎల్లో తొలి మహిళా ఆక్షనీర్‌గా ఆమె నిలిచారు. గతంలో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలం కూడా నిర్వహించారు. క్రికెట్‌కు సంబంధించిన వేలాలే కాదు ప్రో-కబడ్డీ లీగ్ వేలంపాటలు నిర్వహించిన అనుభవం కూడా ఆమెకు ఉంది. ప్రోకబడ్డీ లీగ్ సీజన్-8 వేలం నిర్వహణ బాధ్యతలను ఆమే చూసుకున్నారు.
కాగా ఐపీఎల్ వేలంలో ఎవరెవరు ఎంత ధరకు అమ్ముడుపోతారు? రికార్డులు ఏమైనా బద్దలవుతాయా? అనే ఆసక్తి క్రికెట్ అభిమానుల్లో నెలకొంది. మరోవైపు ఐపీఎల్ వేలం తొలిసారి భారత్ వెలుపల జరగబోతోంది.