TTD: తిరుమల శ్రీవారికి భారీ విరాళం అందించిన చెన్నై భక్తుడు
- టీటీడీ దాతృత్వ కార్యక్రమాలకు చెన్నై భక్తుడు వర్ధమాన్ జైన్ రూ.2.02 కోట్లు విరాళం
- ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్ట్‌కు రూ.1.01 కోట్లు, ప్రాణదాత ట్రస్ట్‌కు రూ.1.01 కోట్లు విరాళంగా
- వ్యాసరాజ మఠాధిపతి విద్యాశ్రీశ తీర్ధ స్వామీజీ సమక్షంలో టీటీడీ అడిషనల్ ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరికి విరాళం చెక్కు అందజేత
కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే తిరుమల శ్రీవారిని నిత్యం లక్షలాది మంది భక్తులు దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకుంటుంటారు. అలాగే శ్రీవారిని దర్శించుకునే వారిలో చాలా మంది వారి శక్తికొలది స్వామి వారికి కానుకలను, విరాళాలను సమర్పించుకుంటారు.
పారిశ్రామికవేత్తలు, ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు, సెలబ్రిటీలు, సంస్థల ప్రతినిధులు భారీ ఎత్తున శ్రీవారికి విరాళాలు అందజేస్తుంటారు. కొందరైతే నిలువుదోపిడీ (ఒంటిపై ఉన్న ఆభరణాలు అన్నీ) స్వామివారికి విరాళంగా అందజేసి తమ మొక్కుబడి చెల్లించుకుంటుంటారు. తాజాగా చెన్నైకి చెందిన ఓ భక్తుడు శనివారం శ్రీవారికి భారీ విరాళాన్ని అందించారు.
టీటీడీ దాతృత్వ కార్యక్రమాల నిర్వహణకు గానూ చెన్నైకి చెందిన భక్తుడు వర్దమాన్ జైన్ రూ.2.02 కోట్ల విరాళం సమర్పించారు. ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్ట్ కు రూ.1.01 కోట్లు, ప్రాణదాత ట్రస్ట్ కు రూ.1.01 కోట్లు విరాళంగా ఇచ్చారు. విరాళాలకు సంబంధించిన డీడీలను ఆయన ఆలయంలో వ్యాసరాజ మఠాధిపతి విద్యాశ్రీశ తీర్ధ స్వామీజీ సమక్షంలో టీటీడీ అడిషనల్ ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరికి అందజేశారు.