IPL-2025: ఐపీఎల్ మెగా వేలం రేపే ప్రారంభం... కీ డీటెయిల్స్ ఇవిగో!
- మార్చి 14 నుంచి ఐపీఎల్-2025
- నవంబరు 24, 25 తేదీల్లో ఆటగాళ్ల మెగా ఆక్షన్
- సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా వేలం ప్రక్రియ
- రేపు మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం
- స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్ లో లైవ్
ప్రపంచ క్రికెట్ ముఖ చిత్రాన్ని మార్చిన ఈవెంట్లలో ఐపీఎల్ ముఖ్యమైనది. టీ20 లీగ్ క్రికెట్ కు సరికొత్త నిర్వచనం చెప్పిన ఈ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఇప్పటివరకు 17 సీజన్లు పూర్తి చేసుకుంది. ఇక, వచ్చే ఏడాది మార్చి 14న ఐపీఎల్-2025 సీజన్ ప్రారంభం కానుంది.
ఇక అసలు విషయానికొస్తే... ఈసారి అన్ని ఫ్రాంచైజీలు పెద్ద సంఖ్యలో ఆటగాళ్లను రిలీజ్ చేసిన నేపథ్యంలో... రేపు, ఎల్లుండి మెగా వేలం జరగనుంది. నవంబరు 24, 25 తేదీల్లో జరిగే ఐపీఎల్ ఆటగాళ్ల వేలం ప్రక్రియకు సౌదీ అరేబియా నగరం జెడ్డా వేదికగా నిలవనుంది.
ఈ వేలానికి సంబంధించిన ముఖ్యమైన వివరాలు...
- ఆది, సోమవారాల్లో వేలం ప్రక్రియ నిర్వహిస్తారు. ప్రతి రోజూ మధ్యాహ్నం 3.30 గంటల నుంచి ఆటగాళ్ల వేలం కొనసాగుతుంది.
- ఐపీఎల్ మెగా ఆక్షన్-2025 కార్యక్రమం స్టార్ స్పోర్ట్స్ చానల్లోనూ, జియో సినిమా యాప్ లోనూ, వెబ్ సైట్ లోనూ ప్రత్యక్ష ప్రసారం కానుంది.
- ఈసారి వేలంలో 577 మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వీరిలో 367 మంది భారత ఆటగాళ్లు కాగా, 210 మంది విదేశీ క్రికెటర్లు. 204 స్లాట్స్ కోసం వీరు వేలంలో పోటీ పడనున్నారు. ఇందులో 70 స్లాట్స్ విదేశీ ఆటగాళ్ల కోటాకు చెందినవి.
- భారత ఆటగాళ్లలో 48 మంది జాతీయ జట్టుకు ఆడిన వాళ్లు (క్యాప్డ్) కాగా... మిగిలినవాళ్లంతా దేశవాళీ క్రికెటర్లే (అన్ క్యాప్డ్). విదేశీ క్రికెటర్లలో 197 మంది జాతీయ జట్లకు ఆడిన వాళ్లు కాగా.... 12 మంది అన్ క్యాప్డ్ ప్లేయర్లు.
- ఈసారి ఐపీఎల్ వేలంలో ముగ్గురు ఐసీసీ అనుబంధ సభ్య దేశాలకు చెందిన ఆటగాళ్లు కూడా పాల్గొంటున్నారు.
- వేలం తుది జాబితాలో ఉన్న ఆటగాళ్లలో 82 మంది తమ కనీస ధరను రూ.2 కోట్లుగా నిర్ణయించుకున్నారు. 27 మంది ఆటగాళ్లు రూ.1.5 కోట్లు, 18 మంది రూ.1.25 కోట్లు, 23 మంది రూ.1 కోటి, 92 మంది రూ.75 లక్షలు, ఎనిమిది మంది రూ.50 లక్షలు, ఐదుగురు రూ.40 లక్షలు, 320 మంది రూ.30 లక్షల కనీస ధరను నిర్ణయించుకున్నారు.
- వేలంలో ఉన్న ఆటగాళ్లందరిలో పెద్ద వయస్కుడు ఇంగ్లాండ్ సీనియర్ పేసర్ జేమ్స్ ఆండర్సన్. ఆండర్సన్ వయసు 42 ఏళ్లు. ఐపీఎల్ లో ఆడనుండడం ఆండర్సన్ కు ఇదే ప్రథమం. ఈ లెజెండరీ పేసర్ తన కనీస ధరను రూ.1.25 కోట్లుగా పేర్కొన్నాడు.
- ఇక, ఐపీఎల్ వేలంలో అత్యంత పిన్న వయస్కుడు... వైభవ్ సూర్యవంశి. ఈ బీహార్ కుర్రాడి వయసు కేవలం 13 ఏళ్లే. వైభవ్ సూర్యవంశి ఇప్పటివరకు ఐదు ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు మాత్రమే ఆడాడు. ఇండియా అండర్-19 తరఫున రెండు యూత్ టెస్టు మ్యాచ్ లు కూడా ఆడాడు. గత నెలలో జరిగిన ఆస్ట్రేలియా అండర్-19 జట్టుపై ఈ చిచ్చరపిడుగు సెంచరీ బాదడం విశేషం.
ఏ ఫ్రాంచైజీ వద్ద ఎంత డబ్బు ఉందంటే...
- పంజాబ్ కింగ్స్- రూ.110.5 కోట్లు
- చెన్నై సూపర్ కింగ్స్- రూ.55 కోట్లు
- గుజరాత్ టైటాన్స్- రూ.69 కోట్లు
- లక్నో సూపర్ జెయింట్స్- రూ. 69 కోట్లు
- ముంబయి ఇండియన్స్- రూ.45 కోట్లు
- సన్ రైజర్స్ హైదరాబాద్- రూ.45 కోట్లు
- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు- రూ.83 కోట్లు
- ఢిల్లీ క్యాపిటల్స్- రూ.73 కోట్లు
- కోల్ కతా నైట్ రైడర్స్- రూ. 51 కోట్లు
- రాజస్థాన్ రాయల్స్- రూ. 41 కోట్లు