BJP: 48 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు... బీజేపీ కూటమిదే హవా
- అసోం, బీహార్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, ఉత్తరాఖండ్‌లో అన్ని సీట్లు బీజేపీ కూటమివే
- రాజస్థాన్, యూపీ, మధ్యప్రదేశ్‌లలో మెజార్టీ సీట్లలో బీజేపీ కూటమి గెలుపు
- కర్ణాటక, బెంగాల్, పంజాబ్‌లలో ఒక్క సీటూ గెలుచుకోని బీజేపీ
- రెండు లోక్ సభ స్థానాల్లో ఒకచోట కాంగ్రెస్, మరోచోట బీజేపీ గెలుపు
మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు 15 రాష్ట్రాల్లో 48 అసెంబ్లీ స్థానాలకు, 2 లోక్ సభ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. మహారాష్ట్రలో బీజేపీ ఆధ్వర్యంలోని మహాయుతి, ఝార్ఖండ్‌లో జేఎంఎం-కాంగ్రెస్ కూటమి విజయం సాధించింది. ఉప ఎన్నికలు జరిగిన 48 అసెంబ్లీ స్థానాల్లో మెజార్టీ సీట్లు ఎన్డీయే గెలుచుకుంది.
అసోంలో ఐదు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగగా... ఐదింట ఎన్డీయే కూటమి విజయం సాధించింది. బీహార్‌లో నాలుగు చోట్ల ఉప ఎన్నికలు జరగగా... ఎన్డీయే కూటమే గెలుపొందింది. బీజేపీ రెండు చోట్ల, కూటమి పార్టీలైన హిందుస్థానీ అవామీ మోర్చా, జేడీయూ ఒక్కోచోట విజయం సాధించాయి. ఛత్తీస్‌గడ్, గుజరాత్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఒక్కోచోట ఉప ఎన్నిక జరగగా... అక్కడ కూడా బీజేపీ గెలిచింది.
రాజస్థాన్‌లో ఏడు స్థానాలకు ఉప ఎన్నిక జరగగా... ఐదింట బీజేపీ, ఒకచోట కాంగ్రెస్, మరొకచోట భారత్ ఆదివాసీ పార్టీ విజయం సాధించాయి. యూపీలో తొమ్మిది స్థానాలకు ఉప ఎన్నిక జరగగా... ఆరుచోట్ల బీజేపీ, రెండు స్థానాల్లో ఎస్పీ, ఒకచోట ఆర్ఎల్డీ గెలుపొందాయి. మధ్యప్రదేశ్‌లో రెండు స్థానాలకు ఉప ఎన్నిక జరగగా... ఒకచోట కాంగ్రెస్, ఒకచోట బీజేపీ గెలిచాయి.
ఈ రాష్ట్రాల్లో బీజేపీయేతర పార్టీలు
కర్ణాటకలో మూడుకు మూడు స్థానాల్లో కాంగ్రెస్, మేఘాలయలో ఒక స్థానానికి ఉప ఎన్నిక జరగగా నేషనల్ పీపుల్స్ పార్టీ, పంజాబ్‌లో నాలుగు స్థానాలకు ఎన్నికలు జరగగా మూడు చోట్ల ఆమ్ ఆద్మీ పార్టీ, ఒకచోట కాంగ్రెస్, సిక్కింలోని రెండు స్థానాల్లో సిక్కిం క్రాంతి కారీ మోర్చా, పశ్చిమ బెంగాల్‌లో ఆరు చోట్ల ఉప ఎన్నికలు జరగగా... ఆరింట తృణమూల్ కాంగ్రెస్ గెలుపొందాయి.
రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరగగా... ఒకచోట కాంగ్రెస్, మరోచోట బీజేపీ గెలిచింది. వయనాడ్ లోక్ సభ స్థానం నుంచి ప్రియాంక గాంధీ విజయం సాధించింది. నాందేడ్ నుంచి బీజేపీ అభ్యర్థి సంతకుక్ రావ్ గెలుపు ముంగిట నిలిచారు.