Maharashtra Results: ఎన్నికల్లో గెలిచినా పదవి కోల్పోనున్న షిండే!

Maharashtra CM Shinde Loose His Post

  • మహారాష్ట్ర కాబోయే సీఎం ఫడ్నవీస్ అంటున్న బీజేపీ
  • ఫలితాల ట్రెండ్ పై స్పందించిన మహా సీఎం షిండే
  • ఇది భారీ విజయం అంటూ ఓటర్లకు ధన్యావాదాలు తెలిపిన నేత

సాధారణంగా ఎన్నికల్లో ఓటమి పాలైన నేతలు అప్పటి వరకు తమ పదవిని కోల్పోవడం చూస్తుంటాం.. కానీ మహారాష్ట్రలో మాత్రం ఎన్నికల్లో గెలిచినప్పటికీ ఏక్ నాథ్ షిండే తన సీఎం పదవిని కోల్పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి సంచలన ఫలితాలు నమోదు చేస్తుండడం, మహాయుతి కూటమిలో బీజేపీ సింగిల్ గానే మ్యాజిక్ ఫిగర్ సాధించే అవకాశం ఉండడమే దీనికి కారణం. మహాయుతి కూటమిలో సీఎం సీటు కోసం మూడు పార్టీల నేతలు పట్టుబడుతున్నారు.

ఆయా పార్టీలకు చెందిన కిందిస్థాయి నేతలు తమ లీడరే సీఎం అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. అయితే, తాజా పరిణామాలతో సీఎం పదవి బీజేపీకీ దక్కనుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇందుకు తగ్గట్లే మహారాష్ట్రకు కాబోయే సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అంటూ బీజేపీ మహారాష్ట్ర నేతలు ప్రకటనలు విడుదల చేస్తున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 సీట్లు ఉన్నాయి.

ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 145 సీట్లు.. ప్రస్తుతం బీజేపీ అభ్యర్థులు 149 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. చివరి వరకూ ఇదే ట్రెండ్ కొనసాగితే బీజేపీ సింగిల్ గానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. కూటమిగా పోటీ చేసిన నేపథ్యంలో శివసేన (షిండే వర్గం), ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం) నేతలకూ ప్రభుత్వంలో తగిన ప్రాధాన్యం కల్పిస్తుందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. అయితే, ముఖ్యమంత్రి సీటు మాత్రం బీజేపీ వదులుకోదని చెబుతున్నారు.
 
ఇది భారీ విజయం: షిండే
మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల ట్రెండ్ పై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే స్పందించారు. మహాయుతి కూటమికి ఇది భారీ విజయమని వ్యాఖ్యానించారు. మహిళలు, రైతులు సహా ఓటర్లందరికీ షిండే ధన్యవాదాలు తెలిపారు. కాగా, ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో మహాయుతి కూటమికి చెందిన ఏడుగురు అభ్యర్థులు గెలుపొందారు. మరో 211 స్థానాల్లో కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఇక ఎంవీఏ కూటమి అభ్యర్థులు 57 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

Maharashtra Results
Eknath Shinde
Maharashtra CM
BJP Majority
Mahayuti Alliance
CM Post
  • Loading...

More Telugu News