pharma companies: తెలంగాణలో పెట్టుబడులకు ముందుకొచ్చిన ఆరు ఫార్మా కంపెనీలు

pharma companies mou with telangana government
  • ఫార్మా సిటీలో ఆరు కంపెనీలకు అవసరమైన స్థలాల కేటాయింపుకు సర్కార్ అంగీకారం
  • సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమై చర్చించిన కంపెనీల ప్రతినిధులు
  • సర్కార్‌తో ఒప్పందం చేసుకున్న ఆరు ఫార్మా కంపెనీలు
ఆరు ప్రముఖ ఫార్మా కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. ఈ నేపథ్యంలో సదరు కంపెనీ ప్రతినిధులు శుక్రవారం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో సమావేశమై చర్చించారు. ఎంఎస్ఎన్ లేబొరేటరీ, లారస్, గ్లాండ్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, అరబిందో, హెటిరో ల్యాబ్స్ కంపెనీలు ప్రభుత్వంతో ఎంవోయూ (ఒప్పందం) చేసుకున్నాయి. 
 
ఈ క్రమంలో ఫార్మా సిటీలో ఆరు కంపెనీలకు అవసరమైన స్థలాన్ని కేటాయించేందుకు తెలంగాణ సర్కార్ అంగీకరించింది. లారస్ ల్యాబ్స్, అరబిందో ఫార్మా సంస్థలు ఫార్ములేషన్ యూనిట్‌లు నెలకొల్పనుండగా, ఎంఎస్ఎన్ లేబొరేటరీ ఉత్పత్తి, ఆర్ అండ్ డీ కేంద్రం ఏర్పాటు చేయనుంది. 
 
గ్లాండ్ ఫార్మా ఆర్ అండ్ డీ కేంద్రంతో పాటు ఇంజెక్టబుల్, డ్రగ్స్ సబ్ స్టాన్స్ ఉత్పత్తి యూనిట్లను స్థాపించనుంది. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ఇంజెక్టబుల్, బయో సిమిలర్ల యూనిట్‌ను, హెటిరో ల్యాబ్స్ ఫినిష్డ్ డోస్, ఇంజెక్టబుల్ తయారీ పరిశ్రమను నెలకొల్పనున్నాయి. ఈ ఆరు కంపెనీలు రూ.6,280 కోట్ల పెట్టుబడులు పెట్టనుండగా, కంపెనీల విస్తరణ కార్యక్రమాల ద్వారా సుమారు 12,490 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం వెల్లడించింది. 
pharma companies
Telangana
CM Revanth Reddy

More Telugu News