Manipur: మణిపూర్‌కు మరో 20,000 మంది పారామిలటరీ సిబ్బంది.. కేంద్రం కీలక నిర్ణయం
మణిపూర్‌లో మళ్లీ హింస చెలరేగిన నేపథ్యంలో అక్కడి పరిస్థితులపై కేంద్రం ప్రత్యేక దృష్టిసారించింది. మరో 20 వేల మంది పారామిలిటరీ సిబ్బందితో కూడిన 20 కంపెనీల బలగాలను రాష్ట్రానికి పంపించింది. ఇటీవలే కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమీక్ష అనంతరం 50 వేల మంది పారామిలిటరీ సిబ్బందిని మణిపూర్‌కు పంపించామని, అదనంగా మరో 20 వేల మంది బలగాలను రాష్ట్రంలో మోహరించామని అధికారులు తెలిపారు. దీంతో హింసాత్మక పరిస్థితులు వేగంగా పెరుగుతున్న మణిపూర్‌కు గత 10 రోజుల వ్యవధిలో ఏకంగా 90,000 మంది అదనపు పారామిలటరీ సిబ్బందిని తరలించినట్టు అయింది. వేర్వేరు ప్రాంతాల్లో ఈ బలగాలను అధికారులు మోహరించారు.
మరోవైపు.. మణిపూర్ భద్రతపై శుక్రవారం సమీక్ష జరిగిందని రాష్ట్ర ప్రభుత్వ భద్రతా సలహాదారు కుల్దీప్ సింగ్ వెల్లడించారు. అన్ని జిల్లాలు, ఇంఫాల్ నగరంలో భద్రతపై చర్చించామని, ఈ సమావేశంలో సైన్యం, పోలీసులు, సీఆర్‌పీఎఫ్, బీఎస్ఎఫ్, ఐటీబీపీ అధికారులు కూడా పాల్గొన్నారని వివరించారు. అన్ని జిల్లాల డీసీలు, ఎస్పీలతో సమస్యలపై చర్చించామని వెల్లడించారు.
కాగా నవంబరు 7న జిరిబామ్ జిల్లా జైరాన్ గ్రామంలో హ్మార్ కమ్యూనిటీకి (కుకీ తెగలో ఉపవర్గం) చెందిన ఒక మహిళను సజీవ దహనం చేయడంతో మణిపూర్‌లో మరోసారి హింస చెలరేగిన విషయం తెలిసిందే. అక్టోబర్ 1 నుంచి నవంబర్ 18 మధ్య కనీసం 16 వేర్వేరు హింసాత్మక ఘటనలు జరిగాయి. హత్యలు, దహన ఘటనలు, భారీ కాల్పుల ఘటనలు నమోదయ్యాయి. నవంబర్ 7 నుంచి నవంబర్ 18 మధ్య ఒక్క జిరిబామ్ జిల్లాలోనే కనీసం 20 మంది మరణించారు.