Mahesh Kumar Goud: స్కిల్ యూనివర్సిటీకి అదానీ రూ.100 కోట్లు ఇచ్చిన అంశంపై స్పందించిన మహేశ్ కుమార్ గౌడ్
- అదానీ ఇచ్చిన రూ.100 కోట్లు రేవంత్ రెడ్డి జేబులోకి వెళ్లవన్న మహేశ్ కుమార్ గౌడ్
- స్కిల్ యూనివర్సిటీకి కేటీఆర్ విరాళం ఇచ్చినా తీసుకుంటామన్న టీపీసీసీ చీఫ్
- అదానీ కుంభకోణాన్ని అమెరికా బయటపెట్టిందన్న మహేశ్ కుమార్ గౌడ్
గౌతమ్ అదానీ తెలంగాణలోని స్కిల్ యూనివర్సిటీకి రూ.100 కోట్లు ఇచ్చారని, కానీ ఆ మొత్తాన్ని రేవంత్ రెడ్డి జేబులోకి ఇవ్వలేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... స్కిల్ యూనివర్సిటీకి ఎవరు ఇచ్చినా స్వీకరిస్తామని, కేటీఆర్ కూడా వచ్చి రూ.50 కోట్లు ఇస్తామంటే తీసుకుంటామన్నారు. అదానీ ఇచ్చిన రూ.100 కోట్లు ఆన్ రికార్డ్ అన్నారు. వ్యాపారాలు జరగాలి... పెట్టుబడులు రావాలనేదే తమ ఆలోచన అన్నారు. కానీ మోసం చేస్తే కూడా విచారణ జరగాలనేది తమ డిమాండ్ అన్నారు.
అదానీ కుంభకోణాన్ని అమెరికా అధికారులు బయటపెట్టారన్నారు. అదానీ దాదాపు రూ.2 వేల కోట్ల మేర లంచాలు పంచారని ఆరోపించారు. అదానీ కుంభకోణాలపై రాహుల్ గాంధీ ఎన్నిసార్లు చెప్పినా ఎవరూ స్పందించలేదన్నారు. అర్హత లేకపోయినప్పటికీ అదానీకి వేలాది కోట్ల రూపాయల రుణాలు ఇచ్చారని ఆరోపించారు. ఆయన అవినీతిపై ఇప్పుడు అమెరికా కూడా చెప్పిందన్నారు. అదానీ వ్యవహారంపై ప్రధాని మోదీ పెదవి విప్పడం లేదని విమర్శించారు.
ఈ వ్యవహారంపై తక్షణమే జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ అండతో అదానీ విచ్చలవిడిగా సంపద పెంచుకున్నారని ఆరోపించారు. జేపీసీ విచారణ జరిపి అదానీ తప్పులు బయటపడితే మోదీ ప్రధాని పదవి నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఉంటుందన్నారు. తక్షణమే అదానీని అరెస్ట్ చేయాలని మహేశ్ కుమార్ డిమాండ్ చేశారు.