Gorantla Butchaiah Chowdary: అమెరికాలో కేసులు వాయిదా వేయించుకునే పరిస్థితి లేదు: జగన్ ను ఉద్దేశించి గోరంట్ల బుచ్చయ్య చౌదరి
- రూ. 1,750 కోట్ల లంచం తీసుకోవడం జగన్ కు ఒక లెక్క కాదన్న గోరంట్ల
- గంగవరం పోర్టును అదానీకి అక్రమంగా కట్టబెట్టారని ఆరోపణ
- అదానీ కేసులో జగన్ బుక్ కావడం ఖాయమని వ్యాఖ్య
తన అవినీతి ఖ్యాతిని వైసీపీ అధినేత జగన్ విశ్వవ్యాప్తం చేసుకున్నారని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎద్దేవా చేశారు. రూ. 60 వేల కోట్లు దోచుకున్న జగన్ ఈడీ, సీబీఐ కేసుల్లో ఉన్నారని... అయినా 12 ఏళ్లుగా కేసులను నడుపుకుంటూ వెళుతున్నారని విమర్శించారు.
జైలుకు వెళ్లకుండా కేసులను ఎలా పొడిగించుకోవాలో తెలిసిన వ్యక్తి జగన్ అని అన్నారు. అలాంటి వ్యక్తికి రూ. 1,750 కోట్లు లంచం తీసుకోవడం ఒక లెక్కా? అని ప్రశ్నించారు. ఇండియాలో అయితే కేసులు వాయిదా వేయించుకోవచ్చని... అమెరికాలో వాయిదా వేయించుకునే అవకాశం లేదని చెప్పారు. అదానీ నుంచి లంచం తీసుకున్న కేసులో జగన్ బుక్ కావడం ఖాయమని అన్నారు.
అదానీతో జగన్ అనేక ఒప్పందాలు చేసుకున్నారని బుచ్చయ్య చౌదరి తెలిపారు. ఒక తెలుగువాడు నిర్వహిస్తున్న గంగవరం పోర్టును జగన్ అక్రమంగా అదానీకి కట్టబెట్టారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ అవినీతి పరాకాష్ఠకు చేరుకుందని అన్నారు.
తాడేపల్లిలోని నివాసానికి ప్రభుత్వ ఖర్చుతో ఇనుప బారికేడ్లు పెట్టుకున్నారని బుచ్చయ్య చౌదరి విమర్శించారు. సీఎంగా ఎక్కడ పర్యటనకు వెళ్లినా చెట్లు కొట్టేయడం, దుకాణాలను మూసేయడం, పరదాలు కట్టుకోవడం చేసేవారని... ఇంత పిరికివాడు సీఎం ఎలా అయ్యాడని ఎద్దేవా చేశారు.