new textile policy: ఏపీలో త్వరలో నూతన టెక్స్ టైల్ పాలసీ: మంత్రి సవిత
- రాష్ట్ర వ్యాప్తంగా వీవర్ శాలలు ఏర్పాటు చేస్తామన్న మంత్రి సవిత
- ఎమ్మిగనూరు, రాయదుర్గం, మైలవరం, పామిడిలో టెక్స్ టైల్స్ పార్కులు
- చేనేత కార్మికులకు 90 శాతం సబ్సిడీతో పనిముట్లు అందజేస్తామన్న మంత్రి సవిత
త్వరలోనే నూతన టెక్స్ టైల్ప్ పాలసీ తీసుకురానున్నట్లు రాష్ట్ర చేనేత, జౌళిశాఖ మంత్రి ఎస్. సవిత తెలిపారు. గురువారం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఎమ్మిగనూరులో టెక్స్‌టైల్స్ పార్కుపై టీడీపీ ఎమ్మెల్యే బి. జయనాగేశ్వరరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సవిత సమాధానం ఇచ్చారు. ఎమ్మిగనూరులో టెక్స్‌టైల్స్ పార్కు ఏర్పాటుకు గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే నిర్ణయించడం జరిగిందని, అందుకు 90 ఎకరాలను కేటాయిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేశారన్నారు.
తరవాత జగన్ సర్కార్ దాన్ని పట్టించుకోలేదన్నారు. అంతే కాకుండా పేదల ఇళ్ల పేరుతో ఎమ్మిగనూరు టెక్స్‌టైల్స్ పార్కులో 14 ఎకరాలను వైసీపీ ప్రభుత్వం కేటాయించిందన్నారు. దీనిపై తాము న్యాయపోరాటం ద్వారా టెక్స్‌టైల్స్ పార్కు భూములను కాపాడుకోవడం జరిగిందన్నారు. ఎమ్మిగనూరులో కచ్చితంగా టెక్స్‌టైల్స్ పార్కు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. దీని వల్ల 5 వేల మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు.
చీరాలలో హ్యాండ్లూమ్, టెక్స్ టైల్స్ పార్కులు
ఎమ్మిగనూరుతో పాటు రాయదుర్గం, మైలవరం, పామిడిలోనూ టెక్స్ టైల్స్ పార్కులు ఏర్పాటు చేయబోతున్నామని మంత్రి సవిత తెలిపారు. చీరాలలో హ్యాండ్లూమ్ పార్క్‌తో పాటు టెక్స్ టైల్స్ పార్కు కూడా నిర్మించనున్నట్లు తెలిపారు. త్వరలోనే టెక్స్ టైల్స్ పాలసీ తీసుకురాబోతున్నట్లు చెప్పారు. మంగళగిరిలో మంత్రి నారా లోకేశ్ వీవర్ శాలలు ఏర్పాటు చేసి చేనేతలకు అండగా నిలిచారన్నారు.
అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా వీవర్ శాలలు ఏర్పాటు చేసే ఆలోచన తమ ప్రభుత్వానికి ఉందన్నారు. ఇప్పటికే కొందరు ఎంపీలు తమ ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి వీవర్ శాలలు ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చారని చెప్పారు. ఆదిత్య బిర్లా గ్రూప్ వంటి సంస్థల సాయంతో రాష్ట్రంలో పలుచోట వీవర్ శాలలు, క్లస్టర్లు ఏర్పాటు చేయబోతున్నామన్నారు.
చేనేత కార్మికులకు 90 శాతం సబ్సిడీతో పనిముట్లు అందజేయబోతున్నామని తెలిపారు. ధర్మవరంలో మెగా టెక్స్ టైల్స్ పార్కు ఏర్పాటుకు రూ.30 కోట్ల నిధులను కేంద్రం నుంచి రాష్ట్ర వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మంజూరుకు కృషి చేశారన్నారు. చేనేత రంగానికి, నేతన్నకు తమ ఎన్డీయే ప్రభుత్వం పూర్వ వైభవం తీసుకురానుందని మంత్రి సవిత వెల్లడించారు.