Droupadi Murmu: హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- బేగంపేట విమానాశ్రయంలో స్వాగతం పలికిన గవర్నర్, సీఎం, కేంద్రమంత్రులు
- నేరుగా రాజ్ భవన్ చేరుకున్న ద్రౌపది ముర్ము
- రేపు లోక్ మంథన్-2024లో పాల్గొననున్న ద్రౌపది ముర్ము
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ చేరుకున్నారు. వివిధ అధికారిక కార్యక్రమాలలో హాజరయ్యేందుకు ఆమె నగరానికి వచ్చారు. హైదరాబాద్‌లో జరుగుతున్న కోటి దీపోత్సవానికి కూడా ఆమె హాజరుకానున్నారు. ఈ రోజు సాయంత్రం బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క తదితరులు ఘనస్వాగతం పలికారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కూడా ఆమెకు పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు.
బేగంపేట విమానాశ్రయం నుంచి ఆమె నేరుగా రాజ్ భవన్ చేరుకున్నారు. అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకొని ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న కోటి దీపోత్సవానికి వెళ్లనున్నారు. రేపు శిల్పకళా వేదికలో జరుగుతోన్న లోక్ మంథన్-2024 కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత ఆమె ఢిల్లీకి వెళ్లనున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో నగరంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.