TTD: తిరుమలలో శ్రీరామచంద్ర ఉత్సవ మూర్తికి అంగుళీ సంధాన సంప్రోక్షణం
- 2021లో శ్రీరామ మూర్తి ఎడమచేయి భిన్నం గుర్తించి బంగారు కవచంతో తాత్కాలిక పరిష్కారం
- మహాసంప్రోక్షణకు చాలా సమయం ఉండడంతో తక్షణ శాశ్వత సవరణ చేపట్టిన టీటీడీ
- మంగళ, బుధవారాల్లో ఆగమోక్త పూజలు, హోమం నిర్వహించి విగ్రహ మరమ్మతులు పూర్తి
తిరుమల ఆలయంలో బుధవారం ఉదయం శ్రీ సీతా, లక్ష్మణ సమేత శ్రీరామచంద్ర మూర్తి ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీరాముల వారి విగ్రహంలోని ఎడమచేయి మధ్య వేలి భిన్నాన్ని శాస్త్రోక్తంగా సవరించారు.
2021లో శ్రీరాముల వారి విగ్రహం ఎడమచేయి మధ్య వేలిలో చిన్నపాటి భిన్నం ఏర్పడినట్లు గుర్తించారు. అప్పట్లో ఈ భిన్నాన్ని తాత్కాలికంగా బంగారు కవచం తొడగడం ద్వారా సరిచేశారు. అయితే, శాశ్వతంగా వీటిని సవరించడం కోసం సంప్రోక్షణ అవసరమైంది.
సాధారణంగా ఉత్సవ విగ్రహాలకు ఇటువంటి భిన్నాలు ఏర్పడినప్పుడు మహా సంప్రోక్షణ సందర్భంగా వాటిని సవరించడం పరిపాటి. టీటీడీ చివరిసారిగా మహా సంప్రోక్షణ కార్యక్రమాన్ని 2018లో నిర్వహించింది. తదుపరి మహా సంప్రోక్షణ 2030లో నిర్వహించాల్సి ఉంది. అయితే, అప్పటి వరకు వేచి చూడడం వల్ల విగ్రహానికి హాని కలగవచ్చని భావించి జీయర్ స్వాములు, ఆగమ సలహాదారుల సలహాల మేరకు ఆగమోక్తంగా మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించారు.
చిన్నపాటి భిన్నాన్ని శాస్త్రోక్తంగా సవరించేందుకు మంగళవారం మరియు బుధవారం రెండు రోజుల్లో సంప్రోక్షణ కార్యక్రమం చేపట్టారు. మంగళవారం రాత్రి వైఖానస ఆగమ ప్రకారం కళాపకర్షణ, బింబ వాస్తు, మహాశాంతి తిరుమంజనం, శయనాధివాసం వంటి పూజలు నిర్వహించారు. బుధవారం ఉదయం ప్రత్యేక హోమం, పూర్ణాహుతి, కళావాహన కార్యక్రమాల అనంతరం భిన్నాన్ని సవరించారు.
తిరుమల జీయర్ స్వామీజీల ఆధ్వర్యంలో వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ ప్రధాన అర్చకులు శ్రీ వేణు గోపాల దీక్షితులు, శ్రీ కృష్ణ శేషాచల దీక్షితులు, శ్రీ గోవిందరాజ దీక్షితులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ వెంకయ్య చౌదరి సహా ఇతర ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.