YS Sharmila: ఎమ్మెల్యేలను గెలిపించుకోలేని జగన్.. ప్రతిపక్ష హోదా అడగడం సిగ్గుచేటు: షర్మిల

Sharmila fires on Jagan

  • అసెంబ్లీకి వెళ్లని జగన్ కు ఎమ్మెల్యే పదవి ఎందుకని ప్రశ్నించిన షర్మిల
  • కడప్ స్టీల్ ప్లాంట్ కు జగన్, అవినాశ్ ఏం చేశారని ప్రశ్న
  • స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలకే పరిమితమయిందని వ్యాఖ్య

తన అన్న, వైసీపీ అధినేత జగన్ పై ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రతిపక్ష హోదాకు అవసరమైనంత మంది ఎమ్మెల్యేలను కూడా గెలిపించుకోలేని జగన్... ప్రతిపక్ష హోదా అడగడం సిగ్గుచేటని అన్నారు. అసెంబ్లీకి వెళ్లని జగన్ కు ఎమ్మెల్యే పదవి ఎందుకని ప్రశ్నించారు. కడప స్టీల్ ప్లాంట్ కోసం జగన్, కడప వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి ఏం చేశారని నిలదీశారు. ఇలాంటి నాయకులను ఎన్నుకునే ముందు ప్రజలు ఆలోచించుకోవాలని అన్నారు. కడపలో మీడియాతో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. 

కడప స్టీల్ ప్లాంట్ కేవలం శంకుస్థాపనలకే పరిమితమయిందని షర్మిల అన్నారు. పేదల కోసం, కడప ప్రాంతం అభివృద్ధి కోసం వైఎస్సార్ దీన్ని తీసుకొచ్చారని చెప్పారు. ఈ ప్లాంట్ ద్వారా 25 వేల మందికి ప్రత్యక్షంగా, లక్ష మందికి పరోక్షంగా ఉపాధి కల్పించే అవకాశం ఉందని అన్నారు. వైఎస్ చనిపోయిన తర్వాత వచ్చిన నాయకులందరూ కడప స్టీల్ ప్లాంట్ ఊసే లేకుండా చేశారని విమర్శించారు. 

2019లో అధికారంలోకి వచ్చిన జగన్ కూడా కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణాన్ని విస్మరించారని షర్మిల దుయ్యబట్టారు. మూడేళ్లలో స్టీల్ ప్లాంట్ నిర్మాణాన్ని చేపట్టి తన చిత్తశుద్ధిని నిరూపించుకుంటానని ఆస్కార్ లెవెల్లో జగన్ డైలాగులు చెప్పారని ఎద్దేవా చేశారు. పదేళ్లుగా కడప ఎంపీగా ఉన్న అవినాశ్ రెడ్డి స్టీల్ ప్లాంట్ కోసం పార్లమెంటులో ఏం చేశారని నిలదీశారు. స్టీల్ ప్లాంట్ కేవలం శంకుస్థాపనలకే పరిమితమయిందని అన్నారు. ఇది శంకుస్థాపనల ఫ్యాక్టరీగా, టెంకాయలు కొట్టే ప్రాజెక్ట్ గా మారిందని చెప్పారు. 'చేయాలి చెల్లి పెళ్లి మళ్లీ మళ్లీ' అన్నట్టుగా తయారయిందని ఎద్దేవా చేశారు. మీడియా ముందు టెంకాయలు కొట్టి నిరసన వ్యక్తం చేశారు.

YS Sharmila
Congress
Jagan
YS Avinash Reddy
YSRCP
  • Loading...

More Telugu News