Kurnool: కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ప్రక్రియ ప్రారంభం
- హైకోర్టు రిజిస్ట్రార్ కు న్యాయశాఖ కార్యదర్శి లేఖ
- రాయలసీమ జిల్లాల నుంచి దాఖలైన కేసుల వివరాలు ఇవ్వాలని విన్నపం
- రాయలసీమలో 1.59 కోట్ల మంది జనాభా ఉన్నారని వెల్లడి
కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు దిశగా ఏపీ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. బెంచ్ ఏర్పాటుకు సంబంధించి హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ కు కేంద్ర న్యాయశాఖ కార్యదర్శి సునీత లేఖ రాశారు. రాయలసీమలోని నాలుగు జిల్లాలు కర్నూలు, కడప, అనంతపురం, చిత్తురు జిల్లాల నుంచి హైకోర్టులో దాఖలైన కేసుల వివరాలను ఇవ్వాలని లేఖలో కోరారు. రెండు, మూడేళ్ల కంటే ఎక్కువ కాలం నుంచి పెండింగ్ లో ఉన్న కేసుల వివరాలను కూడా ఇవ్వాలని విన్నవించారు. ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేయాలంటే ఈ నాలుగు జిల్లాల నుంచి 1/3 కేసులు ఉండాలని పేర్కొన్నారు.
ఏపీ మొత్తం జనాభా 4.95 కోట్లు కాగా... రాయలసీమ ప్రాంతంలో 1.59 కోట్ల మంది ఉన్నారని తెలిపారు. రాష్ట్ర జనాభాలో 25 శాతం మంది రాయలసీమలో ఉన్నారని చెప్పారు. దేశంలో ఇప్పటికే 7 రాష్ట్రాల్లో హైకోర్టు బెంచ్ లు ఏర్పాటు చేశారని తెలిపారు. రాయలసీమ రీజియన్ నుంచి రాష్ట్ర రాజధానికి వచ్చేందుకు రవాణా సౌకర్యం కూడా సరిగా లేదని చెప్పారు.