Rishabh Pant: ఈజీ క్యాచ్ వదిలేసిన సర్ఫరాజ్ ఖాన్.. నవ్వాపుకోలేకపోయిన కోహ్లీ, జురెల్.. కిందపడి పడీపడీ నవ్విన పంత్.. వీడియో ఇదిగో!
- శుక్రవారం ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో తలపడనున్న భారత జట్టు
- నిన్న ముమ్మరంగా ప్రాక్టీస్
- జురెల్‌కు చోటు ఖాయం కావడంతో సర్ఫరాజ్‌పై వేటు పడే అవకాశం
ఫీల్డింగ్‌లో సర్ఫరాజ్‌ఖాన్ ఈజీ క్యాచ్‌ను వదిలేయడంతో విరాట్ కోహ్లీ, ధ్రువ్ జురెల్‌తోపాటు రిషభ్‌పంత్ నవ్వాపుకోలేకపోయారు. పంత్ అయితే కిందపడి మరీ పడీపడీ నవ్వాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్లు శుక్రవారం తొలి టెస్టులో తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం సన్నద్ధమవుతున్న భారత జట్టు నిన్న ప్రాక్టీస్ మొదలుపెట్టింది.
ఫీల్డింగ్‌లో కోహ్లీ, సర్ఫరాజ్, జురెల్ వరుసగా పక్కపక్కనే ఒకరి తర్వాత ఒకరు నిల్చున్నారు. క్యాచ్‌ను ప్రాక్టీస్ చేస్తుండగా సర్ఫరాజ్ ఓ సులభమైన క్యాచ్‌ను వదిలిపెట్టేశాడు. తన ముఖం దగ్గరగా వచ్చిన బంతిని పట్టుకునే ప్రయత్నం చేసి విఫలమయ్యాడు. అది చూసిన కోహ్లీ పుసుక్కున నవ్వేశాడు. జురెల్ ముఖాన్నిచేతితో కప్పుకుని నవ్వుకోగా, పంత్ అయితే కిందపడి మరీ పడీపడీ నవ్వాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కాగా, కోహ్లీ, దేవదత్ పడిక్కల్, కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, జురెల్ స్లిప్ క్యాచ్ ప్రాక్టీస్ చేశారు. దీనిని బట్టి జట్టులో వీరు టాప్-6లో ఉంటారని అర్థమవుతోంది. జురెల్‌కు జట్టులో చోటు ఖాయం కావడంతో సర్ఫరాజ్‌పై వేటు పడే అవకాశం ఉంది. కాగా, నేడు మరోమారు జట్టు ప్రాక్టీస్‌లో పాల్గొంటారు. ఈ ప్రాక్టీస్‌తో జట్టు కూర్పుపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.