Rishab Pant: రిషబ్ పంత్‌పై సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. వెంటనే స్పందించిన స్టార్ బ్యాటర్
- డబ్బు కారణంగా ఢిల్లీ క్యాపిటల్స్‌ను వీడి ఉండొచ్చన్న మాజీ దిగ్గజం
- రిటెన్షన్ ఫీజు గురించి కాదని కచ్చితంగా చెప్పగలనంటూ ఘాటుగా రిప్లై ఇచ్చిన రిషబ్ పంత్
- ఐపీఎల్ మెగా వేలం-2025లో పంత్ హాట్ కేక్‌గా మారే అవకాశం ఉందంటూ క్రికెట్ వర్గాల్లో అంచనాలు
ఐపీఎల్ 2025 మెగా వేలానికి సమయం సమీపిస్తోంది. నవంబర్ 24, 25 తేదీల్లో వేలం జరగనుంది. కాగా ఈ ఏడాది భారత స్టార్ వికెట్ కీపర్-బ్యాటర్ రిషబ్ పంత్‌కు భారీ డిమాండ్ ఉంటుందనే అంచనాలు నెలకొన్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ రిటెయిన్ చేసుకోకపోవడంతో అతడు వేలంలో ఉండబోతున్నాడు. అయితే చాలా కాలంగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్‌ను వీడడానికి డబ్బే కారణం అయి ఉండొచ్చని భారత క్రికెట్ మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు. రిటెన్షన్ ఫీజు విషయంలో విభేదాలు కారణం అయి ఉండొచ్చని అన్నారు.
ఐపీఎల్ వేలానికి ముందు ‘స్టార్ స్పోర్ట్స్’తో మాట్లాడుతూ గవాస్కర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను స్టార్ స్పోర్ట్స్ షేర్ చేసింది. ‘‘ అగ్రశ్రేణి ఆటగాళ్లు వేలంలో వారి అసలైన విలువను తెలుసుకునేందుకు కొన్నిసార్లు ఫ్రాంచైజీలను వదిలిపెట్టాలని నిర్ణయించుకుంటారు. పంత్ కేసు కూడా అదే కాబోలు. ఈ స్టార్ క్రికెటర్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ మరోసారి వేలంలో దక్కించుకుంటుందో లేదో చెప్పడం కష్టం. అయితే అతడిని దక్కించుకోవాలని ఢిల్లీ క్యాపిటల్స్ కోరుకుంటుందనుకుంటున్నా. కొన్నిసార్లు రిటెన్షన్ ఫీజు విషయంలో ఆటగాళ్లు, ఫ్రాంచైజీల మధ్య చర్చ జరుగుతుంది. నంబర్ 1 స్థానంలో రిటెయిన్ చేసుకున్న ఆటగాళ్లకు ఎక్కువ ఫీజులు చెల్లించడం మనం గమనించాం’’ అని సునీల్ గవాస్కర్ వ్యాఖ్యానించడం వీడియోలో కనిపించింది.
గవాస్కర్‌కు పంత్ కౌంటర్
డబ్బు కోసమే ఢిల్లీ క్యాపిటల్స్‌ను వీడి ఉండవచ్చంటూ సునీల్ గవాస్కర్ చేసిన వ్యాఖ్యలపై రిషబ్ పంత్ వెంటనే స్పందించాడు. కారణం అది కాదని స్పష్టం చేశారు. డబ్బు విషయంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ను వీడలేదని తాను కచ్చితంగా చెప్పగలనని అన్నాడు. ఈ మేరకు ఎక్స్ వేదికగా స్పందించారు.