Etela Rajender: రేవంత్ రెడ్డిపై ఈటల రాజేందర్ తీవ్ర విమర్శలు

Etala Rajendar hot comments on Revanth Reddy

  • ఫార్మా సిటీని రద్దు చేస్తామని చెప్పి... ఇప్పుడు కొడంగల్‌లో ఏర్పాటు చేస్తున్నారని విమర్శ
  • లగచర్లలో మాపై దాడి జరగలేదని కలెక్టరే చెబుతున్నారన్న ఈటల రాజేందర్
  • ఎందుకు రాద్దాంతం చేస్తున్నారని నిలదీత

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీజేపీ నేత, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ముచ్చర్లలో ఫార్మా సిటీ భూసేకరణ సమయంలో రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకు హద్దేలేదని... కానీ ఇప్పుడు మాట మార్చుతున్నారని మండిపడ్డారు.

కాంగ్రెస్ పార్టీ ఫార్మా సిటీని రద్దు చేస్తామని కూడా మేనిఫెస్టోలో పేర్కొందని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు ఇచ్చిన హామీలనే నెరవేర్చడం లేదని విమర్శించారు. ఫార్మా సిటీని రద్దు చేస్తామని ఎన్నికలకు ముందు చెప్పిన కాంగ్రెస్... ఇప్పుడు ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా కొడంగల్‌లో ఏర్పాటు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ ఈరోజు ప్రజాపాలన సంబరాలు జరుపుకోవడాన్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అబద్ధాల పునాదుల మీద రేవంత్ రెడ్డి పాలన కొనసాగిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని ప్రజలు కూడా చర్చించుకుంటున్నారని ధ్వజమెత్తారు. 

గత ప్రభుత్వం ముచ్చర్లలో ఫార్మా సిటీ కోసం 19 వేల ఎకరాలు భూసేకరణ చేసేందుకు ప్రయత్నించిందన్నారు. అప్పుడే కాంగ్రెస్ ఫార్మా సిటీని వ్యతిరేకించిందని గుర్తు చేశారు. ఇప్పుడు ఫోర్త్ సిటీ కోసం రైతుల పొట్ట కొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

లగచర్లలో మా మీద దాడి జరగలేదని కలెక్టరే చెబుతున్నారని, అయినప్పటికీ దీనిని ఎందుకు రాద్దాంతం చేస్తున్నారని ప్రశ్నించారు. రైతులను హింసించడం దారుణమన్నారు. ఎనిమిది నెలలుగా నిరసన తెలుపుతున్న వారిని గుర్తించి థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారని ఆరోపించారు. నర్మద, సబర్మతి తరహాలో మూసీని అభివృద్ధి చేయాలంటే స్పష్టమైన ప్రణాళిక ఉండాలన్నారు. ఇళ్లను కూల్చి రియల్ ఎస్టేట్ సంస్థలకు అప్పగించడం కాదన్నారు.

ప్రధాని మోదీని విమర్శించే స్థాయి సీఎంకు ఉందా? అని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఆటో డ్రైవర్లు అత్యధికంగా ఆత్మహత్యలు చేసుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బెల్ట్ షాపులు రద్దు చేస్తామని ఎన్నికలకు ముందు చెప్పారని... కానీ ఇప్పుడు మద్యం ఏరులై పారుతోందన్నారు.

  • Loading...

More Telugu News