Dharmapuri Arvind: కేటీఆర్ ఏమైనా ముఖ్యమంత్రా.. మంత్రా?: ధర్మపురి అర్వింద్

BJP MP Dharmapuri Arvind Sensational Comments On KTR

  • గవర్నర్ అనుమతి అక్కర్లేదని, అరెస్టు చేసి లోపల పడేయాలని అర్వింద్ సూచన
  • లగచర్లలో కలెక్టర్ పై దాడి వెనక కల్వకుంట్ల కుటుంబం వుందని ఆరోపణ 
  • రేవంత్ రెడ్డి బుల్డోజర్ కు యోగి ఆదిత్యనాథ్ బుల్డోజర్ కు చాలా తేడా ఉందన్న ఎంపీ

బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఏమన్నా ముఖ్యమంత్రా? లేక మంత్రా..? ఆయన అరెస్టుకు గవర్నర్ అనుమతి ఎందుకు? అంటూ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ ను వెంటనే లోపల వేయాలంటూ తెలంగాణ ప్రభుత్వానికి సూచించారు. మంగళవారం హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. లగచర్లలో కలెక్టర్ పై దాడి వెనుక కల్వకుంట్ల కుటుంబం ఉందని ఆరోపించారు. కేటీఆర్‌ ది మేకపోతు గాంభీర్యమని ఎద్దేవా చేశారు.

తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదల పట్ల నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తోందని ఎంపీ అర్వింద్ మండిపడ్డారు. మూసీ ప్రక్షాళన పేరుతో పేదల ఇళ్లను కూల్చేస్తోందని ఆరోపించారు. పాతబస్తీలో ఒక్క బిల్డింగ్ నైనా ఇలా కూల్చేసే దమ్ము ప్రభుత్వానికి ఉందా? అని నిలదీశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని యూపీలోని యోగి ప్రభుత్వంతో పోల్చడాన్ని అర్వింద్ తప్పుబట్టారు. యోగి బుల్డోజర్ కు, రేవంత్ రెడ్డి బుల్డోజర్ కు చాలా తేడా ఉందని చెప్పారు. రేవంత్ సర్కారు ఉద్దేశపూర్వకంగా హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ ను దెబ్బతీస్తోందని ఆరోపించారు. 

మూసీ ప్రక్షాళన విషయంలో రేవంత్ రెడ్డి బీజేపీపై చేసిన ఆరోపణలను ఎంపీ అర్వింద్ తిప్పికొట్టారు. గుజరాత్ లో బీజేపీ ప్రభుత్వం సబర్మతి నది ప్రక్షాళన చేస్తే సమర్థించిన నేతలు తెలంగాణలో మూసీ ప్రక్షాళనపై విమర్శలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించిన విషయం తెలిసిందే. దీనికి అర్వింద్ జవాబిస్తూ.. సబర్మతి నది ప్రక్షాళన సమయంలో ప్రభుత్వం ముందుగా నిర్వాసితులకు ఇళ్లు నిర్మించి, వారిని ఆ ఇళ్లల్లోకి తరలించాకే ప్రక్షాళన మొదలు పెట్టిందని ఎంపీ అర్వింద్ వివరించారు.

Dharmapuri Arvind
BJP
KTR
Moosi
Revanth Reddy
Real Estate
Lagacharla
  • Loading...

More Telugu News