Hyderabad Metro: ప్రైవేటు సంస్థలు ముందుకు రావడం లేదు: మెట్రో రైలు రెండో దశపై ఎన్వీఎస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

NVS Reddy hot comments on Metro rail second phase
  • మెట్రో రెండో దశపై సీఎంతో సుదీర్ఘంగా చర్చించామన్న ఎన్వీఎస్ రెడ్డి
  • మెట్రో రైలు రెండో దశ నిర్మాణం సవాళ్లతో కూడుతున్నదని వ్యాఖ్య
  • మొదటి దశలో ఎల్ అండ్ టీ నష్టపోవడంతో కంపెనీలు ముందుకు రావడం లేదని వెల్లడి
  • కేంద్ర, రాష్ట్ర భాగస్వామ్యంతో చేపట్టాలని సీఎంకు చెప్పామన్న ఎన్వీఎస్ రెడ్డి
మెట్రో రైలు రెండో దశపై ఎండీ ఎన్వీఎస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మెట్రో రెండో దశపై సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా చర్చించినట్లు చెప్పారు. రెండో దశలో మొత్తం 76 కిలోమీటర్ల మేర మెట్రో రైలు నిర్మాణం చేపడుతున్నట్లు వెల్లడించారు. మెట్రో రైలు రెండో దశ నిర్మాణం ఎన్నో సవాళ్లతో కూడుకున్నదన్నారు.

మెట్రో రెండో దశ నిర్మాణానికి ప్రైవేటు సంస్థలు ఏవీ ముందుకు రావడం లేదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మొదటి దశలో ఎల్ అండ్ టీకి భారీగా నష్టం వాటిల్లడమే కారణమని అభిప్రాయపడ్డారు. ఈ అనుభవంతోనే ప్రైవేటు సంస్థలు వెనుకాడుతున్నాయన్నారు. మొదటి దశ మెట్రో కారణంగా ఎల్ అండ్ టీకి రూ.6 వేల కోట్ల నష్టం వాటిల్లినట్లు తెలిపారు. నిర్వహణ కారణంగా ఏడాదికి రూ.1,300 కోట్ల నష్టం వస్తోందన్నారు.

ఇతర రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలే మెట్రోను నిర్వహిస్తున్నాయని వెల్లడించారు. బ్యాంకులు కూడా మెట్రోకు అప్పులు ఇచ్చేందుకు అంగీకరించడం లేదన్నారు. అందుకే కేంద్ర, రాష్ట్ర భాగస్వామ్యంతో మెట్రో రెండో దశ నిర్మాణం చేపట్టాలని ముఖ్యమంత్రికి సూచించినట్లు తెలిపారు. 

మెట్రో రెండో దశ నిర్మాణం రూ.24,269 కోట్ల ప్రాజెక్టు అని అంచనా వేశారు. ఇందులో 48 శాతం నిధులు జైకా ద్వారా సమకూరుతున్నాయన్నారు. ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపాక కేంద్రానికి పంపించామన్నారు. కేంద్రం నుంచి అనుమతులు రాగానే రెండో దశ పనులు ప్రారంభిస్తామన్నారు. ప్రజల సహకారం ఉంటే ఈ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేస్తామని తెలిపారు.
Hyderabad Metro
NVS Reddy
Telangana

More Telugu News