Viral News: ఆవు పేడ కుప్పలో రూ.20 లక్షలకు పైగా నగదు

Raid by police teams from Hyderabad and Odisha recovered Rs 20 lakhs from a heap of cow dung

  • దొంగతనం కేసులో నగదు రికవరీ చేసిన పోలీసులు
  • హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో పనిచేస్తూ నగదు కొట్టేసిన ఒడిశా వ్యక్తి
  • నగదు రికవరీలో భాగంగా ఒడిశాలో బాలపూర్ జిల్లాలోని ఓ గ్రామంలో సోదాలు
  • ఆవు పేడ కుప్పలో డబ్బు దాచిపెట్టినట్టు గుర్తించిన హైదరాబాద్, ఒడిశా పోలీసు బృందాలు

ఆవు పేడ కుప్పలో ఏకంగా రూ.20 లక్షలకు పైగా నగదు పట్టుబడింది. పేడ కుప్పలో అంత డబ్బు దాచిపెట్టడం ఏంటని సందేహంగా ఉందా?.. ఇదంతా దొంగ సొమ్ము. ఒడిశాకు చెందిన ఓ వ్యక్తి హైదరాబాద్‌లో తాను పనిచేస్తున్న ఓ కంపెనీలో ఏకంగా రూ.20 లక్షలకు పైగా నగదు దొంగతనం చేశాడు. ఈ డబ్బుని తన బావకు ఇచ్చి స్వగ్రామానికి పంపించాడు. కంపెనీ ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన హైదరాబాద్ పోలీసులు దర్యాప్తులో భాగంగా ఒడిశా వెళ్లారు. అక్కడి పోలీసుల సాయం తీసుకొని... బాలాసోర్ జిల్లాలో ఉన్న బాదమందరుని గ్రామంలో నిందితుడి అత్తమామల ఇంట్లోని ఆవు పేడ కుప్పలో ఈ డబ్బును దాచిపెట్టినట్టు గుర్తించారు.

హైదరాబాద్, ఒడిశాకు చెందిన పోలీసు బృందాలు జరిపిన సోదాల్లో నిన్న (శనివారం) ఈ నగదు బయటపడింది. కొట్టేసిన నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఒక పోలీసు అధికారి తెలిపారు. కమర్డ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాదమందరుని గ్రామంలో రికవరీ చేసినట్లు వివరించారు. డబ్బు కొట్టేసిన నిందితుడి పేరు గోపాల్ బెహెరా అని, అతడి అత్తమామల ఇంట్లో సోదాలు నిర్వహించామని చెప్పారు. గోపాల్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న వ్యవసాయ అనుబంధ కంపెనీలో పనిచేస్తూ లాకర్‌లో ఉన్న రూ.20 లక్షలకు పైగా నగదు దొంగతనం చేశాడని వెల్లడించారు.

డబ్బుని తన బావ రవీంద్ర బెహెరా చేతికి ఇచ్చి గ్రామానికి పంపించాడని, కంపెనీ ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేయగా డబ్బు పట్టుబడిందని కమర్డ పోలీస్ స్టేషన్ ఐఐసీ ప్రేమదా నాయక్ ప్రకటించారు. నిందితులు గోపాల్, అతడి బావ రవీంద్ర ఇద్దరూ పరారయ్యారని తెలిపారు. గ్రామంలో వారి కుటుంబానికి చెందిన ఒకరిని అదుపులోకి తీసుకున్నామని, విచారణ జరుగుతోందని ప్రేమదా నాయక్ తెలిపారు.

  • Loading...

More Telugu News