Pawan Kalyan: నేను మహారాష్ట్ర వచ్చింది ఓట్లు అడిగేందుకు కాదు: పవన్ కల్యాణ్

Pawan Kalyan speech in Maharashtra

  • మహారాష్ట్రలో నవంబరు 20న అసెంబ్లీ ఎన్నికలు
  • ఎన్డీయే అభ్యర్థుల తరఫున పవన్ కల్యాణ్ ప్రచారం
  • నేడు డెగ్లూరు సభకు హాజరు

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ నేడు మహారాష్ట్రలో ఎన్డీయే అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మహారాష్ట్రలోని డెగ్లూరులో జరిగిన ఎన్నికల సభలో పవన్ కల్యాణ్ మరాఠీలో ప్రసంగించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి. 

జై భవానీ, జై శివాజీ, జై మహారాష్ట్ర అంటూ ప్రసంగం ప్రారంభించారు. తాను మరాఠీలో ప్రసంగిస్తానని, ఏవైనా తప్పులు ఉంటే  క్షమించాలని కోరారు. ఇది ఛత్రపతి శివాజీ పరిపాలించిన భూమి, ఇది ఆయన నడిచిన నేల, ఇంతటి వీరత్వం కలిగిన గడ్డ మహారాష్ట్ర... మరాఠా ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అంటూ కొనసాగించారు. 

తాను ఇక్కడికి ఓట్లు అడిగేందుకు రాలేదని, మరాఠా వీరులకు నివాళి అర్పించడానికి వచ్చానని పవన్ తెలిపారు. మరాఠా యోధుల పోరాటాన్ని గుర్తుచేసుకోవడానికి, శివాజీ మహరాజ్ పరిపాలనను, స్వాతంత్ర్య సమరయోధుల స్ఫూర్తిని గుర్తుచేసుకోవడానికి వచ్చానని వివరించారు. స్వరాజ్యం అర్థం తెలిపిన నేల, అంబేద్కర్ జన్మించిన నేలపై నివాళులు అర్పించేందుకు వచ్చానని పేర్కొన్నారు. 

"గత పదేళ్లుగా నేను ఎన్డీయేతో కలిసి ఉన్నాను. బాలాసాహెబ్ ఠాక్రే మరణించినప్పుడు నివాళులు అర్పించిన వ్యక్తిని నేను. శివసేన వ్యవస్థాపకుడు, హిందూ హృదయ సామ్రాట్ బాలా సాహెబ్ ఠాక్రే నుంచి ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదాన్ని నేర్చుకున్నాను. అయితే, ఆయన జీవించి ఉన్నప్పుడు ఆయనను కలవలేకపోయాను. ఏ విషయంపై అయినా అధికారంతో సంబంధం లేకుండా పోరాటం చేయడం ఆయన నుంచి నేర్చుకున్నాను. 

ఇక, ఎన్డీయే ప్రభుత్వం విషయానికొస్తే... ఎన్డీయే హయాంలో డెగ్లూరులో ఎంతో అభివృద్ది జరుగుతోంది. ప్రతి ఇంటికీ తాగునీటి సౌకర్యం, పోలీస్ స్టేషన్, హేమద్వంతి ఆలయ అభివృద్ధి జరుగుతోంది. అభివృద్ధి కొనసాగాలంటే ఎన్డీయే ప్రభుత్వ ఏర్పాటుకు ప్రజల సహకారం కావాలి. డెగ్లూర్ అసెంబ్లీ అభ్యర్థిగా ఎన్డీయే సభ్యుడి విజయం ఎంతో అవసరం. 

మనం సనాతన ధర్మం కోసం నిలబడాల్సిన అవసరం ఉంది. సినిమాల్లో గొడవలు పెట్టుకోవడం, పోరాటాలు చేయడం ఎంతో ఈజీ. కానీ రియల్ లైఫ్ లో ధర్మ పోరాటాలు చేయడం ఎంతో కష్టం. మనం సనాతన ధర్మం కోసం పోరాడాలి, నిలబడాలి. మనం మతాలుగా విడిపోయినా సెక్యులర్ దేశంగా అవతరించాం. సనాతన ధర్మం కోసం పనిచేద్దాం. మనం ధైర్యంగా ఉంటే ఎవరు తల్వార్ పట్టుకుని వచ్చినా మనల్ని ఏమీ చేయలేరు" అని పవన్ స్పష్టం చేశారు. 

అంతకుముందు, మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్ ప్రసంగిస్తూ... ఇవాళ డెగ్లూరుకు వచ్చింది పవన్ కల్యాణ్ కాదు... ఆంధీ కల్యాణ్ (తుపాను కల్యాణ్) అని అభివర్ణించారు. ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి గెలిచాక... పవన్ ఢిల్లీ వెళ్లారు. ఆ సమయంలోనే ప్రధాని మోదీ మొదటిసారిగా పవన్ ను ఆంధీ (తుపాను) అని అభివర్ణించారు. ఇప్పుడు అశోక్ చవాన్ కూడా అదే ప్రస్తావించారు.

ఇక, డెగ్లూరు సభలో ఏపీ ఆరోగ్య మంత్రి సత్యకుమార్ ప్రసంగిస్తూ... ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గురించి ప్రధాని మోదీ పార్లమెంటులో కూడా చెప్పారని, పవన్ ఆలోచన ఏపీలో 175 సీట్లలో 164 సీట్లు గెలిచేలా చేసిందని కొనియాడారు.

Pawan Kalyan
Deglur
Maharashtra
NDA
Janasena

More Telugu News