Viral Video: డ్యామిట్ కథ అడ్డం తిరిగింది.. తృణమూల్ నేతను చంపాలని తుపాకి తీసిన షూటర్.. రెండుసార్లు ప్రయత్నించినా పేలని గన్.. వీడియో ఇదిగో!

Murder Attempt Goes Wrong Here Is Viral Video

  • పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఘటన
  • ఇంటి బయట మాట్లాడుతున్న నేతపై తుపాకి ఎక్కుపెట్టిన నిందితుడు
  • తుపాకి పేలకపోవడంతో పారిపోయే ప్రయత్నం
  • టీఎంసీ నేతకు చిక్కిన షూటర్.. పోలీసులకు అప్పగింత

ఇంటి బయట కూర్చుని మాట్లాడుతున్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేతను కాల్చి చంపాలనుకున్న దుండగుడి ప్రయత్నం విఫలమైంది. రెండుసార్లు ప్రయత్నించినప్పటికీ తుపాకి పేలకపోవడంతో చివరికి పారిపోయే ప్రయత్నం చేశాడు. కోల్‌కతాలోని కస్బా ప్రాంతంలో గత రాత్రి జరిగిందీ ఘటన. ఈ మొత్తం ఘటన ఆయన ఇంటి ముందున్న సీసీటీవీలో రికార్డయింది.


 కోల్‌కతా మునిసిపల్ కార్పొరేషన్‌లోని 108 వార్డు కౌన్సిలర్ సుశాంత ఘోష్ తన ఇంటి ముందు కూర్చుని కుటుంబ సభ్యులతో మాట్లాడుకుంటున్నారు. అంతలో ఇద్దరు షూటర్లు స్కూటర్‌పై అక్కడికొచ్చారు. వారిలో ఒకడు స్కూటర్ దిగి సుశాంత్ సమీపానికి వచ్చి జేబులోంచి తుపాకి తీసి గురిపెట్టి కాల్చే ప్రయత్నం చేశాడు. అయితే, అది పనిచేయకపోవడంతో మరోసారి ప్రయత్నించాడు. అయినప్పటికీ అది మొరాయించింది. అప్పటికి తేరుకున్న సుశాంత వెంటనే లేచి అతడిని పట్టుకునే ప్రయత్నం చేశాడు. అప్పటికే అతడు తన కోసం వేచి చూస్తున్న స్కూటర్ ఎక్కేశాడు. అయినప్పటికీ వదలని ఘోష్ అతడిని పట్టుకుని లాగాడు. నిన్నెవరు పంపారని అడిగారు. 

 వైరల్ అవుతున్న మరో వీడియోలో నిందితుడి చుట్టూ జనం గుమికూడి ఉన్నారు. తనకెవరూ డబ్బులు ఇవ్వలేదని, ఫొటో ఇచ్చి చంపమని అడిగారని చెప్పడం వినిపించింది. ఆ తర్వాత అతడిని పోలీసులకు అప్పగించారు. కౌన్సిలర్‌ను చంపేందుకు బీహార్ నుంచి కిల్లర్లను రప్పించినట్టు పోలీసుల విచారణలో తేలింది. దీని వెనుక స్థానిక ప్రత్యర్థులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అయితే, తనను చంపేందుకు ప్లాన్ చేసిన వారు ఎవరో తెలియదని కౌన్సిలర్ పేర్కొన్నారు. తాను పుష్కర కాలంగా కౌన్సిలర్‌గా ఉన్నానని, తనపై దాడి జరుగుతుందని ఊహించలేకపోయానని, అది కూడా తన ఇంటి బయట ఉండగా ఇలా జరుగుతుందని అనుకోలేదని పేర్కొన్నారు. 

Viral Video
Kolkata
TMC Leader
Shooter
Crime News

More Telugu News