Child Marriage: 137 ఏళ్ల కొలంబియా సివిల్ కోడ్‌కు చెల్లు.. 17 ఏళ్ల సుదీర్ఘ పోరాటంతో బాల్య వివాహాలకు చెక్!

To check child marriages Colombia brings new law

  • ‘వారు బాలికలు.. భార్యలు కాదు’ అన్న బిల్లుకు ఆమోదం
  • ఐదు గంటల సుదీర్ఘ చర్చ అనంతరం అనుకూలంగా ఓటేసిన చట్ట సభ్యులు
  • 18 ఏళ్లు నిండకుండానే చేసే పెళ్లిళ్లకు ఇది అడ్డుకట్ట
  • కొలంబియాలో పెళ్లీడు రాకముందే 4.5 మిలియన్ల మంది బాలికలకు వివాహాలు

బాల్య వివాహాలను రద్దు చేయాలంటూ కొలంబియాలో 17 ఏళ్లుగా జరుగుతున్న పోరాటం ఫలించింది. బాల్య వివాహాలను అడ్డుకునే బిల్లును తీసుకురావాలంటూ ప్రచార గ్రూపులు పోరాడుతున్నాయి. అయితే, రాజకీయ ప్రత్యర్థులు మాత్రం ఇప్పటి వరకు దీనిని అడ్డుకుంటూ వచ్చారు. ఎట్టకేలకు బుధవారం సుదీర్ఘంగా పెండింగ్‌లో ఉన్న బిల్లుకు మోక్షం లభించింది. ‘వారు బాలికలు.. భార్యలు కాదు’ పేరుతో పిలుస్తున్న ఈ బిల్లుపై ఐదు గంటలపాటు చర్చ జరిగిన అనంతరం ఆమోదం లభించింది. చట్ట సభ్యులు దీనిని ఆమోదించడంతో దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. 18 ఏళ్ల లోపు వారి వివాహాలను ఈ బిల్లు అడ్డుకుంటుంది. 

ఈ బిల్లుకు ఆమోదం లభించడంతో 137 ఏళ్లుగా కొనసాగుతున్న కొలంబియా సివిల్ కోడ్‌లోని లొసుగులకు అడ్డుకట్ట పడింది. తల్లిదండ్రుల ఇష్టంతో మైనర్లకు వివాహం చేయొచ్చని ఈ చట్టం చెబుతోంది. తాజా బిల్లు ఆమోదంతో ఈ సివిల్‌ కోడ్‌కు చట్ట సభ్యులు మంగళం పాడారు. బాల్య వివాహాల వల్ల బాలికలు బాధితులుగా మారుతున్నారని, వేధింపులు, లైంగిక దోపిడీకి గురవుతున్నారని, హక్కుల ఉల్లంఘన జరుగుతోందన్న ఆందోళన వ్యక్తమైంది. ఇప్పుడీ బిల్లుకు అనుకూలంగా ఓటు వేసినందుకు గర్వంగా ఉందని చట్టసభ్యులు కొందరు సంతోషం వ్యక్తం చేశారు. యునిసెఫ్(యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్) ప్రకారం కొలంబియాలో 4.5 మిలియన్ల మంది బాలికలు 18 ఏళ్ల వయసుకు ముందు వివాహాలు చేసుకుంటున్నారు. వీరిలో దాదాపు 10 లక్షల మందికి 15 ఏళ్లలోపే వివాహం జరుగుతోంది.

  • Loading...

More Telugu News