Team India: ఊచకోత అంటే ఇదీ.... పోటాపోటీగా సెంచరీలు బాదిన తిలక్ వర్మ, సంజు శాంసన్
- జొహాన్నెస్ బర్గ్ లో నాలుగో టీ20
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా
- నిర్ణీత 20 ఓవర్లలో 1 వికెట్ కు 283 పరుగులు
- సెంచరీలతో అజేయంగా నిలిచిన సంజూ శాంసన్, తిలక్ వర్మ
సిరీస్ ఫలితం తేల్చే నిర్ణయాత్మక 4వ టీ20 మ్యాచ్ లో టీమిండియా టాపార్డర్ బ్యాటర్లు జూలు విదిల్చారు. దక్షిణాఫ్రికా బౌలర్లను వారి సొంతగడ్డపైనే పసికూనలు మార్చేసి, పరుగుల పండగ చేసుకున్నారు.
ఓపెనర్ సంజు శాంసన్ (109 నాటౌట్), తెలుగుతేజం తిలక్ వర్మ (120) అజేయ సెంచరీలతో చెలరేగారు. వీరిద్దరి శతకాలతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 283 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది.
జొహాన్నెస్ బర్గ్ మైదానంలో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు సంజు శాంసన్, అభిషేక్ శర్మ తొలి వికెట్ కు 73 పరుగులు జోడించి శుభారంభం అందించారు. 36 పరుగులు చేసిన ఓపెనర్ అభిషేక్ శర్మ తొలి వికెట్ రూపంలో వెనుదిరిగాడు.
ఆ తర్వాత సంజు శాంసన్ కు తిలక్ వర్మ జతకలవడంతో వాండరర్స్ స్టేడియంలో పరుగుల సునామీ వచ్చింది. ఈ జోడీ పిడుగుల్లాంటి షాట్లతో విరుచుకుపడడంతో సఫారీ బౌలర్ల పరిస్థితి దయనీయంగా మారింది. సంజూ, తిలక్ పోటాపోటీగా సెంచరీలు పూర్తి చేసుకోవడం విశేషం.
ఈ సిరీస్ లో తొలి మ్యాచ్ లో సెంచరీ సాధించిన సంజూ శాంసన్ వరుసగా రెండు మ్యాచ్ ల్లో డకౌట్ అయి, మళ్లీ నాలుగో మ్యాచ్ లో సెంచరీ నమోదు చేయగా... తిలక్ వర్మ వరుసగా రెండు మ్యాచ్ ల్లో శతక్కొట్కి వావ్ అనిపించాడు. తిలక్ వర్మ సెంచురియన్ లో జరిగిన మూడో టీ20లోనూ సెంచరీ చేయడం తెలిసిందే.
ఇవాళ తిలక్ వర్మ 41 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకోగా...సంజూ శాంసన్ 51 బంతుల్లో శతకం నమోదు చేశాడు. తిలక్ వర్మ మొత్తం 47 బంతులు ఎదుర్కొని 9 ఫోర్లు, 10 సిక్సర్లతో 120 పరుగులు చేయగా... సంజు శాంసన్ 56 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్సర్లతో 109 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్ లో టీమిండియా కేవలం 1 వికెట్ కోల్పోగా... ఆ వికెట్ లూథో సిపామ్లాకు దక్కింది.