Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ వ్యవహారంలో బిగ్ ట్విస్ట్?
- హైబ్రిడ్ మోడల్‌లో టోర్నీ నిర్వహణ పట్ల మొండిగా ఉన్న పాకిస్థాన్
- ఆతిథ్యం నుంచి పీసీబీ వైదొలగితే భారత్ వేదికగా టోర్నీ నిర్వహించొచ్చంటూ బీసీసీఐ వర్గాల్లో చర్చ
- ఆతిథ్యం నుంచి పాక్ వైదొలగితే భారీ జరిమానా విధించే అవకాశం
ఛాంపియన్స్ ట్రోఫీ 2025పై అనిశ్చితి కొనసాగుతోంది. భద్రతా కారణాల రీత్యా ఆతిథ్య పాకిస్థాన్‌కు టీమిండియాను పంపించబోమని, టోర్నీని హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించాలంటూ ఐసీసీకి బీసీసీఐ సమాచారం ఇచ్చిన నాటి నుంచి వివాదం మొదలైంది. ఈ విషయంలో వైఖరిని తెలియజేయాలంటూ పాకిస్థాన్ క్రికెట్ బోర్డుని (పీసీబీ) ఐసీసీ అధికారికంగా కోరినా ఇప్పటివరకు ఎలాంటి సానుకూల స్పందన లేదు. హైబ్రిడ్ మోడల్ విషయంలో విముఖంగా ఉన్న పీసీబీ మొండిగా వ్యవహరిస్తోంది. భారత జట్టు పాకిస్థాన్‌కు రాకపోవడానికి కారణాలు ఏంటో లిఖితపూర్వకంగా తెలియజేయాలని ఐసీసీకి పీసీబీ లేఖ రాసింది. అలాగే తటస్థ వేదికల్లో భారత మ్యాచ్‌ల నిర్వహణ అవకాశాలను పీసీబీ వర్గాలు కొట్టిపారేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఆసక్తికరమైన చర్చ తెరపైకి వచ్చింది. హైబ్రిడ్ మోడల్‌కు అంగీకరించకుండా మొండిగా వ్యవహరించి ఆతిథ్యం నుంచి పాకిస్థాన్ వైదొలగితే... టోర్నీని భారత్‌లోనే నిర్వహించవచ్చని బీసీసీఐ వర్గాలు చర్చిస్తున్నాయని ‘స్పోర్ట్స్ టాక్’ కథనం పేర్కొంది. అయితే ఈ చర్చలు ఇంకా ప్రాథమిక దశలోనే వున్నాయని, ఇంకా ఏదీ ఖరారు కాలేదని తెలిపింది.
మరోవైపు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్యం నుంచి పాకిస్థాన్ తప్పుకుంటే బ్రాడ్‌కాస్టర్లకు భారీ నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుందని ‘స్పోర్ట్స్ టాక్’ తెలిపింది. ముఖ్యంగా భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్‌కు బ్రాడ్‌కాస్టర్లకు పెద్ద మొత్తంలో నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. కాగా, ఛాంపియన్స్ ట్రోఫీ విషయంలో ఐసీసీ మరింత క్రియాశీలకంగా వ్యవహరించనుందని ఓ కీలక అధికారి చెప్పినట్టు ‘క్రిక్‌బజ్’ కథనం పేర్కొంది.