New Delhi: ఢిల్లీలో వాయుకాలుష్యం... ప్రైమరీ స్కూళ్లు మూసివేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం!
- స్టేజ్-3 ఆంక్షలు అమలు చేస్తున్నట్లు వెల్లడి
- 5వ తరగతి వరకు స్కూల్స్ మూసివేత
- ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాలని సీఎం ఆదేశాలు
ఢిల్లీలో వాయుకాలుష్యం భారీగా పెరిగింది. దీంతో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో శుక్రవారం నుంచి స్టేజ్-3 ఆంక్షలను అమలు చేస్తున్నట్లు తెలిపింది. ఇందులో భాగంగా ఢిల్లీలో ప్రైమరీ స్కూల్స్ మూసివేస్తున్నారు. వారికి ఆన్ లైన్ ద్వారా తరగతులు నిర్వహించాలని ముఖ్యమంత్రి అతిశీ ఆదేశాలు జారీ చేశారు. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు ఇవి కొనసాగుతాయన్నారు.
స్టేజ్-3 ఆంక్షల ప్రకారం అత్యవసరం కాని నిర్మాణాలు, కూల్చివేతలపై నిషేధం ఉంటుంది. ఐదో తరగతి వరకు విద్యార్థులకు సెలవులు ఇస్తారు.
ఢిల్లీలో వాయుకాలుష్యం ప్రమాదకరస్థాయికి పెరుగుతోంది. రెండు రోజులుగా వాయు నాణ్యత సూచీ (ఏక్యూఐ) దాదాపు 400 దాటుతోంది. వాయు కాలుష్యం కట్టడి చర్యల్లో భాగంగా ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్-3ని అమలు చేయనున్నట్లు ప్రకటించింది. శుక్రవారం నుంచి ఇది అమల్లోకి వస్తుందని ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ తెలిపింది.