Mahasena Rajesh: మహాసేన రాజేశ్ పై కొత్త కేసు!
- వైసీపీ ఓడిపోయాక తనపై మొదటి కేసు నమోదైందన్న మహాసేన రాజేశ్
- చంద్రబాబు, పవన్, లోకేశ్ లను తిట్టిన వ్యక్తి తనపై కేసు పెట్టాడని వెల్లడి
- పోలీసుల అలసత్వం ఉందని విమర్శలు
దళిత నేత మహాసేన రాజేశ్ పై కేసు నమోదైంది. ఈ విషయాన్ని మహాసేన రాజేశ్ స్వయంగా వెల్లడించారు. ఇది వైసీపీ ప్రభుత్వం ఓడిపోయాక, తనపై నమోదైన మొదటి కేసు అని వివరించారు. అది కూడా సజ్జల భార్గవరెడ్డి నిర్దేశించగా, తనపై కేసు పెట్టారని ఆరోపించారు.
తాను ప్రస్తుతం తెలుగుదేశం అధికార ప్రతినిధిగా ఉన్నానని, ఎస్సీ స్టీరింగ్ కమిటీ సభ్యుడ్నని పేర్కొన్నారు. అయితే కేసు పెట్టినందుకు తానేమీ భయపడడంలేదని, తానేమీ తప్పు చేయలేదని నిరూపించుకునేందుకు అన్ని ఆధారాలు తన వద్ద ఉన్నాయని మహాసేన రాజేశ్ వెల్లడించారు. తనను ఎప్పటికీ తప్పుడు కేసుల్లో ఇరికించలేరని ధీమా వ్యక్తం చేశారు.
వైసీపీ ఓడిపోయిన సమయంలో కూడా అధికార పార్టీ రాష్ట్ర ప్రతినిధినైన తనపై కేసు వేయించారంటే సజ్జల భార్గవరెడ్డిని మెచ్చుకోవాల్సిందేనని అన్నారు. చంద్రబాబును, పవన్ ను, లోకేశ్, అమలాపురం ఎంపీ గంటి హరీశ్ మాధుర్ ను బండబూతులు తిట్టినవాడు తనపై కేసు పెట్టడం కొంచెం బాధగా అనిపించిందని తెలిపారు.
తిట్టిన వాడ్ని బయటికి వదిలేశారని, ఇప్పుడు అతడే పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయారన్న ధీమాతో, తప్పుడు కేసులు పెట్టేందుకు తెగబడ్డాడని మహాసేన రాజేశ్ వివరించారు. ఇందులో అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలీసుల అలసత్వం కనిపిస్తోందని విమర్శించారు.