Soaked Almonds: బాదం పప్పులను... నానబెట్టి తింటే ఇంత లాభమా?
- సంపూర్ణ ఆరోగ్యం కోసం బాదాం తోడ్పాటు
- ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల అరగడంలో సమస్య
- వేయిస్తే.. కొన్ని పోషకాలు కోల్పోయే చాన్స్..
మన శరీరానికి కావాల్సిన అన్ని రకాల పోషకాలు అందాలంటే.. రోజూ గుప్పెడన్ని డ్రైఫ్రూట్స్ తినాలని వైద్య నిపుణులు, డైటీషియన్లు చెబుతుంటారు. ఇందులోనూ బాదం పప్పులు కీలకం. మనకు ఎంతో మేలు చేసే ఒమెగా–3 ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్లు, ఖనిజాలు వీటిలో పుష్కలంగా ఉంటాయి. అయితే.. బాదం పప్పుల్లో ఫైబర్ కూడా ఎక్కువ. వాటిని పచ్చిగా తింటే అరగడంలో కొన్ని సమస్యలు ఉంటాయని.. కొన్ని పోషకాలను శరీరం పూర్తిగా సంగ్రహించుకోలేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. అందువల్ల బాగా నానబెట్టుకుని తింటే ప్రయోజనం ఉంటుందని వివరిస్తున్నారు.
బాదం పప్పులను నానబెట్టడం వల్ల ప్రయోజనాలు
- బాగా నాని మెత్తగా అయిన బాదం పప్పులు పూర్తిగా, త్వరగా జీర్ణం అవుతాయి. ముఖ్యంగా అజీర్తి, గ్యాస్, యాసిడిటీ వంటి సమస్యలు ఉన్నవారికి నానబెట్టడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది.
- బాదంలో ఉండే ఫైటిక్ యాసిడ్, యాంటీ న్యూట్రియెంట్ల కారణంగా శరీరానికి పోషకాలు సరిగా అందవు. అదే బాగా నానబెట్టడం వల్ల ఫైటిక్ యాసిడ్ నీటిలో కరిగిపోతుంది. యాంటీ న్యూట్రియెంట్లు బ్రేక్ అవుతాయి. పోషకాలు బాగా అందుతాయి.
- మన మెదడు, చర్మ ఆరోగ్యానికి కీలకమైన ‘ఈ విటమిన్’ బాదంలో పుష్కలంగా ఉంటుంది. నానబెట్టడం వల్ల ఇది శరీరానికి బాగా అందుతుంది.
- బరువు తగ్గాలనుకునేవారు బాదం పప్పులను నానబెట్టి తినడం వల్ల లాభం ఉంటుంది. నానబెట్టడం వల్ల బాదంలోని ఫైబర్ యాక్టివ్ అవుతుంది. అది కడుపు నిండుగా ఉన్న భావన కలిగించి, ఆకలిని తగ్గిస్తుంది.
- నానబెట్టిన బాదంలో మోనో అన్ శాచురేటెడ్ ఫ్యాట్స్ పరిమాణం కాస్త పెరుగుతుంది. ఈ ఫ్యాట్ ఇది గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది.