Donald Trump: రెండోసారి ఇంకా బాధ్యతలే చేపట్టలేదు.. అప్పుడే మూడోసారి పోటీకి ట్రంప్ సై
- 2028లోనూ అమెరికా అధ్యక్ష రేసులో ఉంటానంటూ పరోక్షంగా వ్యాఖ్య
- మీరు వద్దంటే మరోసారి అధ్యక్ష పదవికి పోటీ పడబోనన్న ట్రంప్
- మూడోసారి అధ్యక్ష పదవి చేపట్టాలంటే రాజ్యాంగ సవరణ తప్పనిసరి
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో సంచలన విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ రెండోసారి ఇంకా బాధ్యతలు చేపట్టనేలేదు. కానీ అప్పుడే మూడోసారి పోటీపడాలనే ఆకాంక్షను వెలిబుచ్చారు. పార్టీ మద్దతుదారులు వద్దంటే తప్ప మరోసారి అధ్యక్ష ఎన్నికల బరిలో ఉంటానని పరోక్షంగా వెల్లడించారు. ఈమేరకు బుధవారం జరిగిన రిపబ్లికన్ నేతల సమావేశంలో ట్రంప్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశానికి ముందు రిపబ్లికన్ నేతలు ప్రెసిడెంట్ గా ఎన్నికైన ట్రంప్ ను ఘనంగా స్వాగతించారు. అనంతరం ట్రంప్ మాట్లాడుతూ.. ‘ఎన్నికల్లో విజయం సాధించడం బాగుంది కదా.. మీరు వద్దంటే నేను మరోసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయను’ అని అన్నారు.
అమెరికా రాజ్యాంగం ప్రకారం రెండుసార్లు అధ్యక్ష బాధ్యతలు నిర్వహించిన వ్యక్తి మూడోసారి పోటీ చేయడానికి వీలులేదు. ఈ విషయంపై అమెరికా రాజ్యాంగానికి 22వ సవరణ చేశారు. ప్రెసిడెంట్ గా ఏ వ్యక్తి అయినా రెండుసార్లకు మించి బాధ్యతలు చేపట్టకూడదని ఈ సవరణ చెబుతోంది. అయితే, ఈ సవరణ ప్రతిపాదించిన సమయంలో కానీ, అమలులోకి వచ్చిన కాలంలో కానీ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న, తాత్కాలికంగా అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తున్న వారికి మినహాయింపు ఉంటుందని పేర్కొంది.
ఈ సవరణ అమలులోకి వచ్చిన ఏడేళ్ల తర్వాత రాష్ట్రాల సమ్మతితో ఈ రూల్ ను తొలగించవచ్చని పేర్కొంది. నాలుగింట మూడోవంతు శాసన సభ్యులు ఆమోదం తెలిపితే మరోసారి రాజ్యంగ సవరణ చేసి ఈ రూల్ ను మార్చవచ్చని తెలిపింది. దీంతో రెండు సార్లు అధ్యక్ష బాధ్యతలు నిర్వహించిన తర్వాత ట్రంప్ మూడోసారి కూడా అధ్యక్షుడిగా పోటీ చేయాలంటే అమెరికా రాజ్యాంగానికి సవరణ చేయాల్సి ఉంటుంది. ట్రంప్ తాజా వ్యాఖ్యలు చూస్తే ఈ సవరణ దిశగా ప్రయత్నాలు చేస్తాడని అమెరికా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.