Rajeev Krishna: తూర్పు గోదావరి జిల్లాలో వైసీపీకి భారీ షాక్.. టీడీపీలో చేరిన వైసీపీ మాజీ సలహాదారు రాజీవ్‌కృష్ణ

YCP leader Rajeev Krishna Joins TDP

  • రాజీవ్‌కృష్ణతో పాటు టీడీపీలో చేరిన పలువురు ఎంపీటీసీలు, జడ్పీటీసీలు
  • టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన లోకేశ్
  • బూతులకు, అసభ్య పోస్టులకు వైసీపీ రోల్ మోడల్ అని లోకేశ్ ఎద్దేవా

తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. కూటమి ప్రభుత్వ సమర్థ పాలనలో భాగస్వామ్యమయ్యేందుకు పలువురు వైసీపీ నేతలు టీడీపీలో చేరుతున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త, వైసీపీ ప్రభుత్వంలో సలహాదారుగా పనిచేసిన ఎస్.రాజీవ్ కృష్ణ మంత్రి నారా లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరారు. రెండు రోజుల క్రితం ఆయన వైసీపీకి రాజీనామా చేశారు. 2014 ఎన్నికల్లో నిడదవోలు నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 

రాజీవ్ కృష్ణతో పాటు చాగల్లు జడ్పీటీసీ విజయదుర్గా శ్రీనివాస్, నిడదవోలు జడ్పీటీసీ కొయ్యా సూర్యారావు, కొవ్వూరు జడ్పీటీసీ బొంత వెంకటలక్ష్మి, ధర్మవరం ఎంపీటీసీ జొన్నకూటి కోమలి, తాళ్లపూడి ఎంపీపీ జొన్నకూటి పోసిరాజు, తాళ్లపూడి సర్పంచ్ నక్కా చిట్టిబాబు, దొమ్మేరు సొసైటీ మాజీ అధ్యక్షుడు గారపాటి వెంకటకృష్ణ, ధర్మవరం సొసైటీ మాజీ అధ్యక్షుడు ముళ్లపూడి కాశీవిశ్వనాథ్, దాపర్తి శివప్రసాద్, మర్ని తారకరాము, వల్లూరి సత్యవరప్రసాద్, నీలం వీరభద్రరావు, ఉప్పులూరి రాజేంద్ర కుమార్, ఇమ్మని వీరశంకరం, బండి అశోక్, నల్లా రామ కిషోర్, పామెర్ల నగేశ్‌కుమార్, నామా సురేంద్ర, వేణుకుమార్ దొప్పలపూడి, ఎన్. దిలీప్ కుమార్, బొల్లిన సతీశ్, గారపాటి అభిరామ్ తదితర 50 మంది వరకు వైసీపీ నేతలు టీడీపీలో చేరారు. ఉండవల్లి నివాసంలో వీరందరికీ పసుపు కండువాలు కప్పి మంత్రి లోకేశ్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ.. బూతులకు, అసభ్యకర పోస్టులకు వైసీపీ ఒక మోడల్ అని ఎద్దేవా చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలతో ఆ పార్టీ 11 స్థానాలకు పడిపోయిందని విమర్శించారు. భాష ప్రధానమని, ప్రజలు మనపై పవిత్ర బాధ్యత పెట్టారని, అసెంబ్లీలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు లేకపోయినా ప్రజాసమస్యల పరిష్కారమే ఏకైక అజెండాగా పనిచేస్తున్నామని చెప్పారు. నేనే రాజు, నేనే మంత్రి అని అనుకోకూడదని, టీడీపీ క్రమశిక్షణ గల పార్టీ అని పేర్కొన్నారు. నేతలు స్థానికంగా అందరినీ సమన్వయం చేసుకుని పనిచేయాలని సూచించారు. అందరం కలిసికట్టుగా రాష్ట్రాభివృద్ధికి కృషిచేద్దామని పిలుపునిచ్చారు. రాజీవ్ కృష్ణ భవిష్యత్‌ను తాను చూసుకుంటానని హామీ ఇచ్చారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి సముచిత గౌరవం కల్పిస్తామని, ప్రజల మెప్పు పొందాలని పేర్కొన్నారు.

రాజీవ్ కృష్ణ మాట్లాడుతూ.. అందరినీ సమన్వయం చేసుకుంటూ పనిచేస్తామని చెప్పారు. పార్టీకి ఆస్తిగా మారతామని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తూ వారికి అన్ని విధాల అండగా నిలుస్తామన్నారు తెలిపారు.ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎంపీ మతుకుమిల్లి శ్రీభరత్, తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, పశ్చిమగోదావరి జడ్పీ మాజీ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, కొత్తపల్లి లాల్, అల్లూరి విక్రమాదిత్య తదితరులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News