Raghu Rama Krishna Raju: రఘురామకృష్ణరాజుపై చిత్రహింసల కేసు.. విచారణలో నాటి ఏఎస్పీ విజయపాల్ డొంకతిరుగుడు సమాధానాలు

Ex ASP Vijay Pal Was Questioned By CBI

  • 2021 మేలో గుంటూరు నగరపాలెం పోలీస్ స్టేషన్‌లో కేసు
  • విచారణకు హాజరైన నాటి ఏఎస్పీ విజయపాల్
  • సుదీర్ఘంగా విచారించిన దర్యాప్తు అధికారులు
  • తెలియదు, గుర్తులేదు, మర్చిపోయానంటూ సమాధానాలు

నరసాపురం మాజీ ఎంపీ, ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజును కస్టడీలో చిత్రహింసలకు గురిచేసిన కేసులో సీఐడీ విశ్రాంత ఏఎస్పీ విజయపాల్ పోలీసుల విచారణలో డొంకతిరుగుడు సమాధానాలు ఇచ్చినట్టు తెలిసింది. దర్యాప్తు అధికారులు ఏ ప్రశ్న అడిగినా తనకు తెలియదని, గుర్తులేదని, మర్చిపోయానని సమాధానాలు చెప్పారు. 2021 మే నెలలో రఘురామను అరెస్ట్ చేసిన పోలీసులు కస్టడీలో చిత్రహింసలకు గురిచేసి, హత్యకు ప్రయత్నించినట్టు గుంటూరు నగరపాలెం పోలీస్ స్టేషన్‌లో ఈ ఏడాది జులైలో కేసు నమోదైంది. ఈ కేసులో విజయపాల్ నిన్న ఒంగోలు జిల్లా పోలీసు కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5.45 గంటల వరకు సుదీర్ఘంగా విచారించారు. దర్యాప్తు అధికారుల ప్రశ్నలకు సూటిగా సమాధానాలు చెప్పకుండా తాను ఏ తప్పూ చేయలేదని చెప్పినట్టు సమాచారం.

కస్టడీలో రఘురామకృష్ణరాజును ఎందుకు కొట్టారు? ఆయన అరికాళ్లపై గాయాలు ఎందుకయ్యాయి? హైదరాబాద్‌లో రఘురామను అరెస్ట్ చేసి గుంటూరు తరలించిన తర్వాత న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చకుండా సీఐడీ కార్యాలయంలో రాత్రంతా ఎందుకు నిర్బంధించారు? కేసు నమోదైన గంటల వ్యవధిలోనే ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది? వంటి ప్రశ్నలకు తనకు తెలియదని, గుర్తులేదని, మర్చిపోయానని సమాధానం ఇచ్చారు. రఘురామను కస్టడీలో కొట్టడం వల్ల మీకు ఎలాంటి ప్రయోజనం కలిగిందన్న ప్రశ్నకు తాను కొట్టలేదని విజయపాల్ సమాధానం ఇచ్చారు. కాగా, అక్టోబర్ 11న గుంటూరులో విచారణకు హాజరైన విజయపాల్ అప్పుడు కూడా ఇలాంటి సమాధానాలే ఇచ్చారు.

  • Loading...

More Telugu News