YS Sharmila: మీకూ మాకూ పెద్ద తేడా లేదు.. జగన్‌పై వైఎస్ షర్మిల మరోసారి విమర్శల దాడి
- బడ్జెట్‌పై తాము చెప్పిందే జగన్ చెప్పారని విమర్శించిన ఏపీసీసీ అధ్యక్షురాలు
- వైఎస్ జగన్ తీరు ఆడలేక మద్దెల ఓడు అన్నట్లుందంటూ వ్యంగ్యాస్త్రాలు
- వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లకపోవడంపై మండిపాటు
- రాష్ట్రంలో అసలైన ‘ఇన్ సిగ్నిఫికెంట్ పార్టీ’ అని వైసీపీపై విమర్శలు
మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, విపక్ష వైఎస్సార్సీపీ లక్ష్యంగా ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. వైఎస్సార్సీపీ, ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీరు ఆడలేక మద్దెల ఓడు అన్నట్లుందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ బాగోలేదని, రాష్ట్ర ప్రజలకు ఉపయోగం కాని బడ్జెట్ అని వైసీపీ కంటే ముందే తాము ప్రెస్‌మీట్ పెట్టి చెప్పామని ఆమె అన్నారు. ‘‘మేము చెప్పిందే జగన్ మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. జగన్ మోహన్ రెడ్డి గారికి 38 శాతం ఓట్లు వచ్చినా.. అసెంబ్లీకి వెళ్లనప్పుడు మీకూ మాకూ తేడా లేదు’’ అని షర్మిల సెటైర్లు వేశారు.
38 శాతం ఓట్ షేర్ పెట్టుకొని అసెంబ్లీకి పోకుండా వైసీపీని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘ఇన్ సిగ్నిఫికెంట్ పార్టీ’గా మార్చారని షర్మిల మండిపడ్డారు. ‘‘అసెంబ్లీలో అడుగు పెట్టలేని, ప్రజా సమస్యల కోసం సభల్లో పట్టుబట్టలేని, పాలకపక్షాన్ని అసెంబ్లీ వేదికగా ప్రశ్నించలేని అసమర్థ వైసీపీ ఇవాళ రాష్ట్రంలో అసలైన ‘ఇన్ సిగ్నిఫికెంట్ పార్టీ’. ప్రజలు ఓట్లు వేసింది ఇంట్లో కూర్చోడానికి కాదు.. సొంత మైకుల ముందు మాట్లాడడానికి కాదు. అసెంబ్లీ మైకుల ముందు మాట్లాడమని. మీకు చిత్తశుద్ధి ఉంటే నిండు సభలో ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై సభ దద్దరిల్లేలా చేయండి’’ అని షర్మిల అన్నారు.
ప్రతిపక్షం కాకపోయినా 11 మంది ప్రజాపక్షం అనిపించుకోవాలని వైసీపీకి ఆమె సూచించారు. ఇప్పటికీ అసెంబ్లీకి వెళ్లే దమ్ము లేకుంటే రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. ‘‘ఎన్నికలకు వెళ్లండి. అప్పుడు ఎవరు ఇన్ సిగ్నిఫికెంట్.. ఎవరు ఇంపార్టెంట్ అన్నది తేలుతుంది కదా. వైసీపీ ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామా చేయాలి. లేదా దమ్ముంటే అసెంబ్లీకి వెళ్లి బడ్జెట్ మీద చర్చించాలి. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఏపీ బీజేపీ సూపర్ సిక్స్ పథకాలకు నిధుల కేటాయింపుపై చర్చించండి’’ అని అన్నారు.