Jagan: కూటమి ప్రభుత్వ బడ్జెట్ పై తీవ్రస్థాయిలో స్పందించిన జగన్

Jagan reacts sharply on state budget

  • ఈ నెల 11న బడ్జెట్ ప్రవేశపెట్టిన కూటమి ప్రభుత్వం
  • గవర్నర్ తో కూడా అబద్ధాలు చెప్పించారన్న జగన్
  • చంద్రబాబు డ్రామా ఆర్టిస్ట్ అంటూ విమర్శలు
  • మోసాలు బయటపడతాయనే బడ్జెట్ ఆలస్యం చేశారని ఆరోపణ

ఈ నెల 11న ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగా, అదే రోజున కూటమి ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ రూ.2.94 లక్షల కోట్లతో బడ్జెట్ సమర్పించారు. ఇందులో మూలధన వ్యయం రూ.32,712 కోట్లు కాగా, ద్రవ్యలోటు రూ.68,743 కోట్లు అని పేర్కొన్నారు. ఈ బడ్జెట్ పై తాజాగా వైసీపీ అధినేత జగన్ తీవ్రస్థాయిలో స్పందించారు. 

ఈ బడ్జెట్ పత్రాలు చూస్తే చంద్రబాబు డ్రామా ఆర్టిస్ట్ అనే విషయం అర్థమవుతుందని విమర్శించారు. అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నా, ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టారని, బడ్జెట్ ప్రవేశపెడితే మోసాలు బయటపడతాయని ఇన్ని నెలలు జాప్యం చేశారని వ్యాఖ్యానించారు. 

గత ప్రభుత్వ హయాంలో... ఏపీ అప్పుల్లో శ్రీలంకను మించిపోతోందని తప్పుడు ప్రచారం చేశారని, ఇదే అంశాన్ని దత్తపుత్రుడితోనూ మాట్లాడించారని జగన్ వెల్లడించారు. ఎన్నికల ముంగిట రాష్ట్రం అప్పులు రూ.14 లక్షల కోట్లు అని ప్రచారం చేశారని, చంద్రబాబు అధికారంలోకి వచ్చాక అవే అబద్ధాలను గవర్నర్ తో కూడా చెప్పించారని మండిపడ్డారు. 

"మేం 2019లో అధికారంలోకి వచ్చినప్పుడు రాష్ట్రం అప్పులు రూ.3.13 లక్షల కోట్లు. 2024లో మేం అధికారం నుంచి దిగిపోయే నాటికి అప్పులు రూ.6.46 లక్షల కోట్లు. చంద్రబాబు హయాంలో అప్పులు 19 శాతం పెరిగితే... మా హయాంలో పెరిగిన అప్పుల శాతం 15 మాత్రమే. ఇప్పుడు చెప్పండి... అప్పు రత్న పురస్కారం ఎవరికి ఇవ్వాలి? ఆర్థిక క్రమశిక్షణ పాటించింది ఎవరు?" అంటూ జగన్ ప్రశ్నించారు. 

చంద్రబాబు ఇప్పుడు కూడా అబద్ధాలు చెబుతుండడం చూస్తుంటే సూపర్ సిక్స్ హామీలకు ఎగనామం పెట్టేట్టున్నాడని జగన్ దుయ్యబట్టారు. అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు తగ్గిస్తామని చెప్పిన చంద్రబాబు.... ఈ ఆరు నెలల్లోనే రూ.17 వేల కోట్ల మేర విద్యుత్ బిల్లులు బాదేశాడని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలోనే రాష్ట్రానికి రిలయన్స్ వచ్చింది... మేం ఉన్నప్పుడే అంబానీ, అదానీ ఏపీకి వచ్చారు.... కానీ ఆ ప్రాజెక్టులన్నీ తామే తీసుకువచ్చినట్టు కూటమి నేతలు చెప్పుకుంటున్నారని జగన్ విమర్శించారు.

Jagan
Budget
YSRCP
TDP-JanaSena-BJP Alliance
Andhra Pradesh
  • Loading...

More Telugu News