Team India: బీసీసీఐ కీల‌క నిర్ణ‌యం... ప్రేక్ష‌కులు లేకుండా ప్రాక్టీస్ మ్యాచ్‌!

BCCI Schedules Practice Match For Indian Team But No One Can Watch

  • భారత జట్టు కోసం ఇంట్రా-స్క్వాడ్ 3 రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌
  • డ‌బ్ల్యూఏసీఏ గ్రౌండ్‌లో వార్మప్ మ్యాచ్
  • శుక్రవారం నుంచి ఆదివారం వరకు జ‌ర‌గ‌నున్న మ్యాచ్‌

స్వ‌దేశంలో న్యూజిలాండ్‌తో జ‌రిగిన మూడు మ్యాచుల‌ టెస్టు సిరీస్ వైట్‌వాస్ కావ‌డంతో టీమిండియాపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. ప్ర‌ధానంగా సీనియ‌ర్ ప్లేయ‌ర్లు ఘోరంగా విఫ‌లం అయ్యారు. దీంతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి ముందు ఆట‌గాళ్ల‌కు వీలైనంత ఎక్కువ ప్రాక్టీస్ అవ‌స‌ర‌మ‌ని పలువురు సీనియ‌ర్లు సూచించారు. దీనిలో భాగంగానే ఈ సిరీస్‌ ప్రారంభానికి ముందు భారత్-ఏతో టీమిండియా వార్మప్ మ్యాచ్‌ను బీసీసీఐ షెడ్యూల్ చేసింది. కానీ, అనూహ్యంగా ఈ మ్యాచ్‌ను బోర్డు రద్దు చేసింది. బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయం చాలా విమర్శలను ఎదుర్కొంది. 

దీంతో దిద్దుబాటు చ‌ర్య‌ల‌కు దిగిన బీసీసీఐ భారత జట్టు కోసం ఇంట్రా-స్క్వాడ్ 3 రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌ని షెడ్యూల్ చేయాలని నిర్ణయించిన‌ట్లు సమాచారం. అయితే, ఎవ‌రు చూడ‌కుండా (వీక్షణకు అవకాశం లేకుండా) మ్యాచ్‌ను నిర్వహించాలని బోర్డు అనుకుంటోంది. త‌ద్వారా సిరీస్ ప్రారంభానికి ముందు అన్ని విషయాలను గోప్యంగా ఉంచాలనేది బీసీసీఐ ఆలోచ‌న‌గా తెలుస్తోంది.

ద‌క్షిణ పెర్త్ లోని డ‌బ్ల్యూఏసీఏ గ్రౌండ్‌లో ఈ ఇంట్రా-స్క్వాడ్ వార్మప్ మ్యాచ్ శుక్రవారం నుంచి ఆదివారం వరకు జ‌ర‌గ‌నుంది. కాగా, ఐదు మ్యాచ్ ల బీజీటీ సిరీస్‌ ఈ నెల 22 నుంచి పెర్త్ వేదిక‌గా జ‌రిగే మొద‌టి టెస్టుతో ప్రారంభం కానుంది. 
  
ఇక ఈ టోర్నీ కోసం ఇప్ప‌టికే కొంత‌మంది భార‌త ఆట‌గాళ్లు ఆస్ట్రేలియా చేరుకున్నారు. విరాట్ కోహ్లీ,  జస్ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్ వంటి కీల‌క ప్లేయ‌ర్లు ఆసీస్ గ‌డ్డ‌పై అడుగుపెట్టారు. ఇప్ప‌టికే తమ శిక్షణ సెషన్లను కూడా ప్రారంభించారు. 

అయితే, పెర్త్ టెస్టుకు కెప్టెన్ రోహిత్ శ‌ర్మ దూర‌మ‌య్యే అవ‌కాశం ఉంది. ఒకవేళ హిట్‌మ్యాన్ ఆడ‌కుంటే అత‌ని స్థానంలో ఓపెన‌ర్‌గా కేఎల్ రాహుల్ బ‌రిలోకి దిగ‌నున్నాడు. యువ ఓపెన‌ర్‌ యశస్వి జైస్వాల్‌తో క‌లిసి రాహుల్ భార‌త ఇన్నింగ్స్ ప్రారంభించ‌నున్నాడు. దీంతో ఈ ఇద్ద‌రు ఓపెన‌ర్లు నిన్న‌ నెట్స్‌లో సాధ‌న చేశారు. వీరితో పాటు వికెట్ కీపర్-బ్యాటర్ రిషబ్ పంత్ కూడా ప్రాక్టీస్‌ సెషన్‌లో పాల్గొన్నాడు.

ఇదిలాఉంటే.. భారత క్రికెట్ జట్టు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి అర్హ‌త సాధించాలంటే బీజీటీ సిరీస్ కీల‌కం. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆస్ట్రేలియాను 4-0తో ఓస్తే టీమిండియా ఫైన‌ల్‌కి క్వాలిఫై అవుతుంది. కివీస్‌తో సిరీస్‌ను 0-3తో ఓడిపోయిన‌ భారత్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి దిగజారింది. ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉంది.

  • Loading...

More Telugu News