Patnam Narendar Reddy: లగచర్ల ఘటనలో అందుకే నన్ను అరెస్ట్ చేశారు: మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి
- రేవంత్ రెడ్డి అప్రజాస్వామిక పాలనపై తమ పోరాటం కొనసాగుతుందన్న మాజీ ఎమ్మెల్యే
- రైతుల తిరుగుబాటుతో సీఎం కంగుతున్నారన్న నరేందర్ రెడ్డి
- డ్యామేజీ కంట్రోల్ చేసుకోవడానికి తమకు ఆపాదించే కుట్ర అని మండిపాటు
లగచర్లలో కలెక్టర్ మీద జరిగిన దాడిని బీఆర్ఎస్‌కు ఆపాదించే కుట్రలో భాగంగానే తనను అరెస్ట్ చేశారని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ మీద జరిగిన దాడి ఘటనలో నరేందర్ రెడ్డి ప్రమేయం ఉందని పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. తన అరెస్ట్‌పై ఆయన మాట్లాడుతూ... సీఎం రేవంత్ రెడ్డి అప్రజాస్వామిక చర్యలపై బీఆర్‌ఎస్ పోరాటం కొనసాగుతుందన్నారు. సొంత నియోజకవర్గం కొడంగల్‌లో రైతుల తిరుగుబాటుతో సీఎం కంగుతిన్నారన్నారు.
ఆ డ్యామేజీని కంట్రోల్ చేసుకోవడానికే లగచర్లలో జరిగిన ఘటనను బీఆర్ఎస్‌కు ఆపాదించే కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు సమస్యల్లో ఉన్నప్పుడు ప్రజాగొంతుకై ప్రశ్నించడం ప్రతిపక్షంగా తమ బాధ్యత అన్నారు. సమస్యలకు పరిష్కారం ఆలోచించకుండా ప్రతిపక్షాలను వేధించడమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిగా పెట్టుకుందని ఆరోపించారు. ప్రభుత్వం బాధ్యత మరిచినప్పుడు ప్రతిపక్షంగా తాము నిలదీస్తామన్నారు. ప్రశ్నించడం తప్పెలా అవుతుందో చెప్పాలన్నారు.