Laapataa Ladies: ఆస్కార్ బరిలో 'లాపతా లేడీస్'.. సినిమా పేరు మార్చేసిన మేకర్స్.. కారణం ఏమిటంటే!
- ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరిలో ఆస్కార్ బరిలో లాపతా లేడీస్
- ఆమిర్ ఖాన్ నిర్మాణం, ఆయన మాజీ భార్య కిరణ్ రావ్ దర్శకత్వం వహించిన మూవీ
- విదేశాల్లో ఆస్కార్ క్యాంపెయిన్ ప్రారంభించిన చిత్ర బృందం
- ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు చేరువ చేసేందుకు మేకర్స్ ప్రయత్నం
- తాజాగా ఈ మూవీ టైటిల్‌ను ‘లాస్ట్ లేడీస్’గా మార్చిన వైనం
బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ నిర్మాణంలో, ఆయన మాజీ భార్య కిరణ్ రావ్ దర్శకత్వం వహించిన మూవీ ‘లాపతా లేడీస్’. ఈ చిత్రం 2025 ఆస్కార్‌కు భారత్ నుంచి అధికారికంగా ఎంపికైన విషయం తెలిసిందే. ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరిలో ఎంట్రీ దక్కించుకుంది. ఈ నేపథ్యంలో ఆమిర్ ఖాన్, కిరణ్ రావ్ ఇతర చిత్ర బృందం విదేశాల్లో ఆస్కార్ క్యాంపెయిన్ ప్రారంభించింది.
ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు చేరువ చేసేందుకు మేకర్స్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఈ మూవీ టైటిల్‌ను మార్చారు. ‘లాస్ట్ లేడీస్’ అనే పేరుతో క్యాంపెయిన్ చేస్తున్నారు. ఈ మేరకు చిత్ర బృందం కొత్త పోస్టర్‌ను అధికారికంగా విడుదల చేసింది.
ప్రముఖ చెఫ్ వికాస్ ఖన్నా న్యూయార్క్‌లో ఏర్పాటు చేసిన ఈ మూవీ స్పెషల్ స్క్రీనింగ్‌కు ఆమిర్ ఖాన్, కిరణ్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆస్కార్ వేడుకలను ఉద్దేశించి అక్కడి మీడియాతో ఆమిర్ మాట్లాడారు. 2002లో తాను నటించిన లగాన్ ఉత్తమ విదేశీ చిత్రంగా ఆస్కార్ బరిలో నిలిచిందని, ఇప్పుడు తాను నిర్మించిన ‘లాపతా లేడీస్’ ఆస్కార్ క్యాంపెయిన్‌కు రావడం ఆనందంగా ఉందన్నారు. మన సినిమాను మనమే ప్రమోట్ చేసుకోవాలి, అందరికీ చేరువ చేయాలి అని ఆయన పేర్కొన్నారు. ఆ ఉద్దేశంతోనే ఈ క్యాంపెయిన్ ప్రారంభించినట్లు ఆమిర్ చెప్పుకొచ్చారు.
ఇక ఈ సినిమా 2001లో సాగే కథాంశంతో తెరకెక్కింది. పల్లెప్రాంతానికి చెందిన ఇద్దరు పెళ్లికూతుళ్లు రైలు ప్రయాణంలో అనుకోకుండా తారుమారు అవుతారు. ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? అనేదే ఈ చిత్ర కథ. ఓ వైపు నవ్విస్తూనే మరోవైపు సీరియస్ అంశాలను చర్చకు తీసుకొచ్చిందీ సినిమా.
ఇందులో జమ్తారా వెబ్‌సిరీస్ ఫేమ్ స్పర్శ్ శ్రీవాస్తవ్ హీరోగా నటించారు. అలాగే భోజ్‌పురి నటుడు రవి కిషన్ కీలక పాత్రలో కనిపించాడు. ఈ సినిమా మార్చి 1న ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం ఇప్పటికే పలు ప్రతిష్ఠాత్మక అవార్డులను కైవసం చేసుకుంది. సుప్రీం కోర్టు ఆవిర్భవించి 75 ఏళ్లు అయిన సందర్భంగా, కోర్టు అడ్మినిస్ట్రేట్ వేడుకల్లోనూ ఈ సినిమా ప్రదర్శితమైన విషయం తెలిసిందే.