Revanth Reddy: ఆ వెంట‌నే కేటీఆర్‌పై చర్యలు: సీఎం రేవంత్ రెడ్డి

Action against KTR after Governor Nod Says CM Revanth Reddy
  • ఫార్ములా ఈ-రేసు కేసులో గవర్నర్ ఆమోదం తర్వాత కేటీఆర్‌పై చర్యలన్న సీఎం
  • ఈ కేసు నుంచి త‌ప్పించుకునేందుకే కేటీఆర్‌ ఢిల్లీ పర్యట‌న అన్న రేవంత్‌
  • ఫార్ములా ఈ-రేసు నిధుల్లో అవకతవకలపై గ‌త నెల‌లో గ‌వ‌ర్న‌ర్‌కు కాంగ్రెస్ ఫిర్యాదు  
ఫార్ములా ఈ-రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఆమోదం తెలిపిన తర్వాత చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ కేసు నుంచి త‌ప్పించుకునేందుకే కేటీఆర్‌ ఢిల్లీలో పర్యటించారని ఆయన మంగళవారం ఢిల్లీలో మీడియాతో అన్నారు. ఇది బీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య ఉన్న రహస్య ఒప్పందాన్ని బట్టబయలు చేస్తోందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన అవినీతి ఇప్పుడు బట్టబయలు అవుతుందని పేర్కొన్నారు. తాము అడిగిన‌ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా కేటీఆర్ ఎదురుదాడికి దిగుతున్నారని అన్నారు. ఫార్ములా ఈ-రేసు నిధుల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై కేటీఆర్‌ను ప్రాసిక్యూట్ చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం గత నెలలో గవర్నర్ అనుమతి కోరిన విష‌యం తెలిసిందే.

ఇక అమృత్ స్కాంలో తనపై కేటీఆర్ చేసిన ఆరోపణలను రేవంత్ రెడ్డి తోసిపుచ్చారు. "రెడ్డిగా పేరున్న వారందరూ నా బంధువులు కాదు" అని సీఎం పేర్కొన్నారు. కాగా, తన బావ సృజన్ రెడ్డికి చెందిన కంపెనీకి అమృత్ కింద రూ.1,137 కోట్ల టెండర్ ను రేవంత్ క‌ట్ట‌బెట్టార‌ని కేటీఆర్ ఆరోపించారు. ఈ ఆరోప‌ణ‌ల‌పై స్పందిస్తూ ముఖ్య‌మంత్రి పైవ్యాఖ్య‌లు చేశారు. 

అమృత్ టెండర్లపై కేటీఆర్ కోర్టును ఆశ్రయించాలనుకుంటే.. ఆ పని చేసే స్వేచ్ఛ అత‌నికి ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. అంతకుముందు ఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో కేటీఆర్ ఈ విష‌య‌మై ఆరోపణలు చేశారు. బీఆర్‌ఎస్ ఎంపీలతో కలిసి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ను కలిసి విచారణ జరిపి అమృత్ టెండర్లను రద్దు చేయాలని వినతిపత్రం సమర్పించారు.

అవినీతిలో కూరుకుపోయిన బీజేపీని తుదముట్టిస్తామని శపథం చేసిన కేటీఆర్ బీజేపీ నేతలను ఎందుకు కలిశారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీకి బీఆర్‌ఎస్ మద్దతిస్తోందని ఆరోపించారు.
Revanth Reddy
KTR
Telangana
Formula E Race Case
Jishnu Dev

More Telugu News