Donald Trump: ఎలాన్ మస్క్‌కు కీలక పదవి ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్

Donald Trump announced Elon Musk will lead the Department of Government Efficiency

  • ‘డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ' విభాగం బాధ్యతలు అప్పగిస్తానని వెల్లడి
  • వివేక్ రామస్వామితో కలిసి బాధ్యతలు చూసుకుంటారని చెప్పిన ట్రంప్
  • ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ కోసం కష్టపడ్డ టెస్లా అధినేత

ఇటీవలే ముగిసిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలుపు కోసం అన్ని విధాలా కృషి చేసిన ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌కు కీలక పదవి ఖాయమైంది. అమెరికా ‘డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ' విభాగానికి ఎలాన్ మస్క్ నాయకత్వం వహిస్తారని అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. వివేక్ రామస్వామితో కలిసి ఎలాన్ మస్క్ ఈ విభాగం బాధ్యతలు నిర్వహిస్తారని తెలిపారు.

‘‘అద్భుతమైన ఈ ఇద్దరు అమెరికన్లు కలిసి మా ప్రభుత్వంలో బ్యూరోక్రసీకి మార్గం చూపుతారు. ‘సేవ్ అమెరికా’ ఉద్యమానికి ముఖ్యమైన ఉద్యోగులపై అదనపు నిబంధనల భారం సడలింపు, వృథా వ్యయాల తగ్గింపు, ఫెడరల్ ఏజెన్సీల పునర్నిర్మాణం వంటి మార్పులు చేపడతారు’’ అని ట్రంప్ వెల్లడించారు.

కాగా గతవారం జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి కమలా హ్యారీస్‌పై రిపబ్లికన్ పార్టీ తరపున పోటీ చేసిన డొనాల్డ్ ట్రంప్ ఘనవిజయం సాధించారు. ట్రంప్ కోసం మస్క్ చాలా కష్టపడ్డారు. భారీగా విరాళాలు అందించడమే కాకుండా ట్రంప్‌తో కలిసి ప్రచార కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. 

ఫలితాలు వెలువడిన తర్వాత ‘విక్టరీ స్పీచ్’లో ఎలాన్ మస్క్‌పై ట్రంప్ ప్రశంసల జల్లు కురిపించారు. అద్భుతమైన వ్యక్తి, మేధావి అని అభివర్ణించారు. ‘‘మనకో కొత్త నక్షత్రం ఉంది. ఆ నక్షత్రమే ఎలాన్ మస్క్’’ అని అన్నారు. రెండు వారాలపాటు విస్తృతంగా ప్రచారంలో పాల్గొన్నారని గుర్తుచేశారు. తనతో కలిసి ఆయన ఫిలడెల్ఫియా, పెన్సిల్వేనియాలో ప్రచారం నిర్వహించారని గుర్తుచేశారు.

  • Loading...

More Telugu News