Varra Ravindra Reddy: వర్రా రవీంద్రారెడ్డి రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు

Sensational details in Varra remand report

  • సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో వర్రా రవీంద్రారెడ్డి అరెస్ట్
  • 14 రోజుల రిమాండ్ విధించిన న్యాయమూర్తి
  • వైసీసీ సోషల్ మీడియా గుట్టు బయటపెట్టిన వర్రా!
  • ఆ ముగ్గురే కీలకమని రిమాండ్ రిపోర్టులో వెల్లడి 

సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోంమంత్రి అనితలపై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టిన వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీంద్రారెడ్డి రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. వైసీపీ సోషల్ మీడియాలో సజ్జల భార్గవరెడ్డి, అర్జున్ రెడ్డి, సుమా రెడ్డి కీలకమైన వ్యక్తులు అని వర్రా వెల్లడించాడు. 

మొదట్లో వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ వివేక్ రెడ్డి సూచనలతో పోస్టులు పెట్టామని, ఆ తర్వాత సజ్జల భార్గవరెడ్డి బాధ్యతలు అందుకున్నాక మరింతగా విజృంభించామని చెప్పాడు. వైసీపీకి వ్యతిరేకంగా టీవీ చానళ్లలో మాట్లాడే వాళ్లని తాము టార్గెట్ చేశామని... నేతలు వారి కుటుంబ సభ్యులపై పోస్టులు పెట్టామని వివరించాడు. 

గతేడాది సెప్టెంబరులో పవన్ కల్యాణ్, వారి పిల్లలపై పోస్టులు పెట్టినట్టు వర్రా అంగీకరించాడు. అయితే, ఆ పోస్టులు తొలగించాలని వెంకటాద్రి అనే వ్యక్తి వచ్చాడని, రూ.2 లక్షలు ఇస్తే ఆ పోస్టులు తొలగిస్తానని అతడిని డిమాండ్ చేసినట్టు తెలిపాడు. 

2020 నుంచి ఐప్యాక్ టీమ్ ద్వారా కంటెంట్ వచ్చేదని, తాము ఫేస్ బుక్ లో పోస్టు చేసేవాళ్లమని తెలిపాడు. జగనే కావాలి, జగనన్న రావాలి యాప్ లోనూ పోస్టు చేసేవాళ్లమని పేర్కొన్నాడు. 

జడ్జిలకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టాలని సజ్జల భార్గవరెడ్డి ఒత్తిడి తెచ్చాడని వర్రా పేర్కొన్నాడు. గత ఏడాది నుంచి నా ఫేస్ బుక్ ఐడీతో భార్గవరెడ్డి పోస్టులు పెడుతున్నాడు అని వర్రా వెల్లడించాడు. 

వైఎస్ షర్మిల, విజయమ్మ, సునీతలపై అభ్యంతరకర పోస్టులు పెట్టాలని అవినాశ్ రెడ్డి పీఏ రాఘవరెడ్డి తమకు సూచించడంతో పాటు, కంటెంట్ కూడా ఇచ్చేవాడని తెలిపాడు. ఆ పోస్టులు ఏ విధంగా ఉండాలన్నది అవినాశ్ రెడ్డి, రాఘవరెడ్డి చర్చించుకునేవాళ్లని వెల్లడించాడు. 

సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో  అరెస్టయిన వర్రా రవీంద్రారెడ్డిని పోలీసులు కోర్టులో హాజరుపర్చగా... న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించడం తెలిసిందే.

  • Loading...

More Telugu News