Sharmila: సోషల్ మీడియాలో నాపై ప్రచారాన్ని జగన్ ప్రోత్సహించారు: షర్మిల

Sharmila alleges Jagan was behind social media propaganda

  • సోషల్ మీడియా పోస్టుల అంశంపై షర్మిల స్పందన
  • జగన్ వద్దు అని చెప్పి ఉంటే తప్పుడు ప్రచారం ఆగేదని వెల్లడి
  • వైసీపీ సోషల్ మీడియా ఓ సైతాన్ ఆర్మీలా తయారైందని విమర్శలు
  • ఇప్పటివరకు పట్టుబడింది విషనాగులేనని వ్యాఖ్యలు
  • విషనాగులతో పాటు అనకొండను కూడా పట్టుకోవాలని సూచన

ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన సోదరుడు, వైసీపీ అధినేత జగన్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. సోషల్ మీడియాలో తాను కూడా బాధితురాలినేనని ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టుల ద్వారా తనపై ప్రచారం వెనుక ఉన్నది జగనే అని స్పష్టం చేశారు. నాపై దుష్ప్రచారం జరుగుతుంటే ఆయన ఆపలేదు... దానర్థం ఏమిటి? ఆ అసభ్యకర ప్రచారాన్ని ఒకరకంగా ఆయన ప్రోత్సహించినట్టే కదా! అని షర్మిల వ్యాఖ్యానించారు. 

జగన్ వద్దు అని చెప్పి ఉంటే ఆ ప్రచారం అప్పుడే ఆగిపోయి ఉండేదని అన్నారు. వైసీపీ సోషల్ మీడియా ఓ సైతాన్ ఆర్మీలా తయారైందని పేర్కొన్నారు. వాళ్లకు వ్యతిరేకంగా ఉండేవారిపై సోషల్ మీడియాలో దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. మహిళలు రాజకీయాల్లో కొనసాగాలంటే భయపడే పరిస్థితి తెచ్చారని ఆవేదన వెలిబుచ్చారు. 

ఇప్పుడు పట్టుబడ్డ వాళ్లంతా విషనాగులేనని, ఆ సోషల్ మీడియా విషనాగులతో పాటు అనకొండను కూడా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉందని షర్మిల ఉద్ఘాటించారు. 

ఇక, అసెంబ్లీ సమావేశాలకు వెళ్లను అనడం జగన్ అహంకారానికి నిదర్శనం అని విమర్శించారు. జగన్ కు ఒకప్పుడు 151 స్థానాలు ఇచ్చిన ప్రజలు, ఇప్పుడు 11 స్థానాలకే పరిమితం చేశారని, జగన్ అక్రమాలు, అవినీతిని ప్రజలు గమనించారని షర్మిల వివరించారు. ప్రజల తీర్పుపై జగన్ కు గౌరవం ఉండాలని హితవు పలికారు. 

సభలో మైకు ఇవ్వలేదంటే, అది మీ స్వయంకృతాపరాధమే అని వ్యాఖ్యానించారు. వైసీపీ ఎమ్మెల్యేలకు ప్రజలు ఓట్లు వేసింది అసెంబ్లీకి వెళ్లడానికి కాదా? మరి ప్రజల ఓట్లతో గెలిచి అసెంబ్లీకి హాజరుకాకపోవడం అంటే ప్రజలను వెన్నుపోటు పొడిచినట్టు కాదా? అని షర్మిల విమర్శించారు. అసెంబ్లీకి గైర్హాజరవడం ద్వారా వైసీపీ ఎమ్మెల్యేల అజ్ఞానం ఏంటో బయటపడిందని అన్నారు. 

ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు, అసెంబ్లీకి వెళ్లబోమని చెప్పి ఓట్లు అడిగారా? అని నిలదీశారు. మీకు సత్తా లేకపోతే రాజీనామా చేయండి అంటూ డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News