National education Day: విలువలతో కూడిన విద్య చాలా అవసరం: చంద్రబాబు
- విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్‌లో జాతీయ విద్యా దినోత్సం వేడుక నిర్వహణ
- 166 మంది ఉత్తమ ఉపాధ్యాయులు, అధ్యాపకులకు సీఎం చేతుల మీదుగా పురస్కారాల ప్రదానం
- రాష్ట్రాన్ని వచ్చే ఐదేళ్లలో నాలెడ్జ్ హబ్‌గా తయారు చేయాల్సిన అవసరం ఉందన్న సీఎం చంద్రబాబు
విలువలతో కూడిన విద్య ప్రస్తుతం చాలా అవసరమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. జాతీయ విద్యా దినోత్సం సందర్భంగా విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్‌లో సోమవారం నిర్వహించిన రాష్ట్ర ఉత్తమ అధ్యాపక, ఉపాధ్యాయ సన్మాన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 166 మంది ఉత్తమ ఉపాధ్యాయులు, అధ్యాపకులందరికీ ముఖ్యమంత్రి చేతుల మీదుగా పురస్కారాలను అందజేసి సత్కరించారు.
అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ .. రాష్ట్రాన్ని వచ్చే ఐదేళ్లలో నాలెడ్జ్ హబ్‌గా తయారు చేయాలని, అది ఉపాధ్యాయుల సహకారంతోనే సాధ్యమవుతుందన్నారు. అన్ని దేశాలకు నైపుణ్యం కల్గిన మానవవనరులను అందించే స్థాయికి మనం ఎదగాలన్నారు. ఉపాధ్యాయుల గౌరవాన్ని కాపాడే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఉపాధ్యాయులకు బోధనేతర పనులు అప్పగించి అవమానించారని, ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో అటువంటి పనులు చెప్పడం జరగదన్నారు.
రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రధాన కేంద్రాన్ని అమరావతిలో ప్రారంభించినట్లు తెలిపారు. తిరుపతి, విశాఖ, రాజమహేంద్రవరం, విజయవాడ, అనంతపురంలో ప్రాంతీయ కేంద్రాలు ఉంటాయని తెలిపారు. నాలెడ్జ్ ఎకానమీకే భవిష్యత్తు ఉంటుందన్నారు. విద్యార్ధి చదువు ముగిసే నాటికి ఉద్యోగం కోసం ప్రయత్నించకుండా ఇతరులకు కొలువులు ఇచ్చే స్థాయికి ఎదగాలన్నారు. ప్రస్తుతం మన వ్యవస్థలో విలువలు పతనమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
సోషల్ మీడియా వెర్రితలలు వేస్తోందన్నారు. ఉపాధ్యాయులు కేవలం బోధనపైనే దృష్టి పెట్టాలని సూచించారు. త్వరలో ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండేలా మెగా డీఎస్సీని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆంగ్ల భాష లేకపోతే ఏదీ లేదన్నట్లుగా కొత్త వాదన తీసుకొస్తున్నారని, కానీ మాతృభాష తెలుగును కాపాడుకోకపోతే తెలుగు జాతే అంతరించిపోతుందన్న విషయం గుర్తించాలన్నారు.