zomato: జొమాటోలో కొత్త సదుపాయం... సగం ధరకే ఫుడ్!
- కస్టమర్లు రద్దు చేసిన ఆర్డర్లను తక్కువ ధరకు కొనుగోలు చేసుకునేందుకు ఫుడ్ రెస్క్యూ ఫీచర్
- నెలకు నాలుగు లక్షల కంటే ఎక్కువ ఆర్డర్లను కస్టమర్లు రద్దు చేస్తున్నారని పేర్కొన్న జొమాటో
- ఆహారం వృథాను అరికట్టేందుకు ఫుడ్ రెస్క్యూ ఫీచర్
ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో ..కొత్త సదుపాయాన్ని తీసుకువచ్చింది. ఫుడ్ రెస్క్యూ అనే ఈ సదుపాయంతో కస్టమర్లు తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. రద్దు చేసిన ఆర్డర్ల ఆహారాన్ని వృథా చేయడాన్ని నిరోధించేందుకు జొమాటో ఈ ప్రత్యేక సదుపాయాన్ని ప్రారంభించింది. ఈ కొత్త ఫుడ్ రెస్క్యూ ఫీచర్ సదుపాయం ద్వారా కస్టమర్లు చాలా తక్కువ ధరలకు ఆహారాన్ని ఆర్డర్ చేసుకోవచ్చు.
నో రిఫండ్ విధానం ఉన్నప్పటికీ వివిధ కారణాలతో నెలకు నాలుగు లక్షల కంటే ఎక్కువ ఆర్డర్లను కస్టమర్లు రద్దు చేస్తున్నారని జొమాటో సహ వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ తెలిపారు. ఇది మాకు ఆందోళన కలిగించే అంశమని, ఆహారాన్ని వృథా చేయడాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ అరికట్టాలని అనుకున్నామని, అందుకే ఫుడ్ రెస్క్యూ ఫీచర్‌ని ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు.
రద్దు చేసిన ఆర్డర్‌ను కొత్త కస్టమర్ క్లైయిమ్ చేస్తే అతను ఆ అమౌంట్‌లో కొంత భాగాన్ని డిస్కౌంట్ పొందుతాడు. ఫుడ్ రెస్క్యూ ఫీచర్‌లో పాల్గొనకూడదనుకునే భాగస్వాములు తమ భాగస్వామి యాప్, డ్యాష్ బోర్డుని ఉపయోగించి సులభంగా నిలిపివేయవచ్చు. కొత్త కస్టమర్‌కు ప్రారంభ పికప్, చివరి డెలివరీ సహా మొత్తం సేవ కోసం డెలివరీ భాగస్వామికి చెల్లించబడుతుంది.