Israel: ఇజ్రాయెల్ లక్ష్యంగా 165 రాకెట్లు ప్రయోగించిన హిజ్బుల్లా

Hezbollah launches over 165 rockets into Israel from Lebanon

  • ఉత్తర ఇజ్రాయెల్‌లోని హైఫా పట్టణం లక్ష్యంగా దాడి
  • లెబనాన్ నుంచి రాకెట్లు ప్రయోగించిన హిజ్బుల్లా
  • ఏడుగురు ఇజ్రాయెల్ పౌరులకు గాయాలు

ఇజ్రాయెల్ లక్ష్యంగా లెబనాన్ లోని మిలిటెంట్ సంస్థ హిజ్బుల్లా ఏకంగా 165 రాకెట్లతో దాడి చేసింది. ఉత్తర ఇజ్రాయెల్‌లోని హైఫా పట్టణం టార్గెట్‌గా లెబనాన్ నుంచి ఈ రాకెట్‌లను ప్రయోగించింది. ఈ దాడుల్లో ఏడుగురు ఇజ్రాయెల్ పౌరులు గాయపడ్డారు. వీరిలో ఒక పసిబిడ్డ కూడా ఉంది. ఈ దాడిని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ నిర్ధారించింది. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్‌ను ఎక్స్ వేదికగా షేర్ చేసింది. ‘‘ ఉత్తర ఇజ్రాయెల్‌పై దాడి జరిగింది. హిజ్బుల్లా దాడుల నుంచి మా పౌరులను కాపాడుకుంటూనే ఉంటాం’’ అని పేర్కొంది. కాగా కొన్ని కార్లు మంటల్లో తగలబడి పోతుండడం వీడియోలో కనిపించింది. దక్షిణ లెబనాన్‌లో సైనిక దాడి మొదలు పెట్టిన తర్వాత ఇజ్రాయెల్‌పై జరిగిన అతిపెద్ద దాడుల్లో ఇదొకటని ‘ది టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్’ కథనం పేర్కొంది. 

లెబనాన్‌లో సెప్టెంబర్‌లో జరిగిన పేజర్, వాకీ-టాకీ దాడుల్లో తమ దేశ ప్రమేయం ఉందని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు అంగీకరించిన కొన్ని గంటల వ్యవధిలోనే ఈ దాడి జరగడం గమనార్హం. కాగా హిజ్బుల్లా కమాండర్లే లక్ష్యంగా జరిగిన పేజర్, వాకీ-టాకీ పేలుళ్ల ఘటనలో కనీసం 39 మంది చనిపోయారు. 3,000 మందికి పైగా గాయపడిన విషయం తెలిసిందే. మరోవైపు హిజ్బుల్లాతో యుద్ధాన్ని ముగించే ప్రయత్నాలలో ‘నిర్దిష్ట పురోగతి’ ఉందని ఇజ్రాయెల్ నూతన విదేశాంగ మంత్రి సోమవారం అన్నారు. అయితే తమకు ఎలాంటి అధికారిక ప్రతిపాదన రాలేదని హిజ్బుల్లా ప్రతినిధి ఒకరు చెప్పారు. అవసరమైతే సుదీర్ఘ యుద్ధానికి సిద్ధమని పేర్కొనడం గమనార్హం.

  • Loading...

More Telugu News