Harish Rao: లగచర్ల గ్రామస్థుల అరెస్టుపై స్పందించిన మాజీ మంత్రి హరీశ్ రావు
- ప్రభుత్వ పనితీరు అమానుషమని ఖండన
- పోలీసులతో ప్రభుత్వం అర్ధరాత్రి దమనకాండ నిర్వహించడం సరికాదని విమర్శ
- ఫార్మా కంపెనీ భూసేకరణను వ్యతిరేకిస్తున్న లగచర్ల గ్రామస్థులు
సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలోని దుద్యాల మండలంలో ఫార్మా కంపెనీ ఏర్పాటు కోసం సోమవారం నిర్వహించిన భూ సేకరణ ప్రజాభిప్రాయ సమావేశం రణరంగంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి లగచర్ల గ్రామస్థుల అరెస్టుపై మాజీ మంత్రి హరీశ్ రావు స్పందించారు. ప్రభుత్వ తీరు అమానుషమని, లగచర్ల వాసులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
లగచర్ల గ్రామానికి 300 మంది పోలీసులు చేరుకొని గ్రామస్థులను అరెస్టు చేయడం దారుణమని విమర్శించారు. ‘‘ఫార్మా భూసేకరణకు నిరాకరించిన వాళ్లను పోలీసులతో బెదిరించాలని చూడడం దారుణం. అర్ధరాత్రి పోలీసులతో ప్రభుత్వం దమనకాండ నిర్వహించడం సరికాదు. ప్రభుత్వం తీరును ఖండిస్తున్నాం. ప్రజాభిప్రాయాన్ని తెలుసుకోకుండా భూసేకరణ చేపట్టడం వెనుక ఉన్న రేవంత్ రెడ్డి ఉద్దేశ్యం ఏమిటో తెలియాలి. సీఎం వ్యక్తిగత ప్రయోజనాల కోసం చేపడుతున్న భూసేకరణను తక్షణం నిలిపివేయాలి. పోలీసుల అదుపులో ఉన్న గ్రామస్థులను, రైతులను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం’’ అని హరీశ్ రావు అన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు.
కాగా ఫార్మా కంపెనీకి భూసేకరణ విషయమై రైతులతో మాట్లాడేందుకు వికారాబాద్ జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్‌తో పాటు ఇతర అధికారులు సోమవారం ప్రయత్నించారు. తమ వాహనాలు దిగి సమావేశం జరిగిన స్థలానికి వెళ్లారు. అధికారులకు వ్యతిరేకంగా గోబ్యాక్, డౌన్ డౌన్ అంటూ రైతులు నినాదాలు చేశారు. అధికారుల వైపు దూసుకెళ్లారు. జిల్లా కలెక్టర్ సహా అక్కడకు వచ్చిన అధికారులు వారికి నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నా వినిపించుకోకుండా ఆగ్రహంతో ఊగిపోయారు.