YSRCP: రాష్ట్రపతి, గవర్నర్‌కు వైసీపీ ఫిర్యాదు
- సోషల్ మీడియా కార్యకర్తలపై పోలీసులు 100కు పైగా కేసులు నమోదు చేశారన్న వైసీపీ
- రాష్ట్రంలో వాక్‌స్వేచ్ఛ అణచివేయబడుతోందని తీవ్ర ఆందోళన
- కస్టడీలో కార్యకర్తలు ప్రాథమిక హక్కులను కోల్పోతున్నారని ఆవేదన
- ఈ విషయంలో రాష్ట్రపతి, గవర్నర్ జోక్యం చేసుకోవాలని ఎక్స్ వేదికగా అభ్యర్థన
తమ సోషల్ మీడియా కార్యకర్తలపై పోలీసులు 100కు పైగా కేసులు నమోదు చేశారని వైసీపీ రాష్ట్రపతి, గవర్నర్‌కు ఫిర్యాదు చేసింది. రాష్ట్రంలో వాక్‌స్వేచ్ఛ లేకుండా పోయిందని, ఇది తీవ్ర ఆందోళన కలిగించే అంశమని పేర్కొంది. కస్టడీలో కార్యకర్తలు ప్రాథమిక హక్కులను కోల్పోతున్నారని తెలిపింది. కల్పిత కేసులు పెడుతున్నారని, ఈ విషయంలో రాష్ట్రపతి, గవర్నర్ జోక్యం చేసుకోవాలని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా అభ్యర్థించింది.
"ఆంధ్రప్రదేశ్‌లో వాక్‌స్వేచ్ఛను అణచివేయడం తీవ్ర ఆందోళన కలిగించే అంశం. సోషల్ మీడియా కార్యకర్తలపై ఏపీ పోలీసులు 100కు పైగా కేసులు నమోదు చేశారు. దాఖలైన పన్నెండు హెబియస్ కార్పస్ పిటిషన్‌లతో అక్రమ నిర్బంధాలు, అర్ధరాత్రి అరెస్టులు, కుటుంబాలపై వేధింపులు. కస్టడీలో కార్యకర్తలు ప్రాథమిక హక్కులను కోల్పోతున్నారు. విమర్శకులు, పాత్రికేయులు, రాజకీయ సంబంధం లేని వ్యక్తులను కూడా లక్ష్యంగా చేసుకోవడానికి కల్పిత కేసులు పెడుతున్నారు.
సోషల్ మీడియా కార్యకర్తలపై బీఎన్ఎస్ సెక్షన్ 111(2)ని ప్రయోగిస్తున్నారు. ఇది అన్యాయం. ఇటువంటి చర్యలు రాజ్యాంగ స్వేచ్ఛ, సుప్రీంకోర్టు తీర్పులు, ప్రజాస్వామ్య పాలనపై ప్రజలు విశ్వాసాన్ని కోల్పోయేలా చేస్తాయి. న్యాయాన్ని కాపాడానికి, భావప్రకటనా స్వేచ్ఛను రక్షించడానికి మీరు జోక్యం చేసుకోవాలని అభ్యర్థిస్తున్నాం" అని వైసీపీ ట్వీట్ చేసింది.