sanjay bangar: లింగమార్పిడి చేయించుకున్న భారత మాజీ క్రికెటర్ కుమారుడు
- లింగమార్పిడి శస్త్ర చికిత్సతో అనయగా మారిన ఆర్యన్
- ఇన్‌స్టాలో తన హార్మోన్ రీప్లేస్‌మెంట్‌కు సంబంధించిన వివరాలు వెల్లడించిన ఆర్యన్
- నా తండ్రిలాగే దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం వస్తుందని ఆశిస్తున్నానని పేర్కొన్న అనయ
టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ కుమారుడు ఆర్యన్ హార్మోన్ రీప్లేస్‌మెంట్ సర్జరీ చేయించుకుని అమ్మాయిగా మారాడు. ఇక నుంచి తన పేరు ఆర్యన్ కాదు అనయ అని పేర్కొన్నాడు. ఈ మేరకు తన మార్పునకు సంబంధించి వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. పది నెలల హార్మోన్ ట్రీట్‌మెంట్ తర్వాత ఆర్యన్ అనయగా ఎలా మారిందో, ఆ ఫోటోలో చూడవచ్చు. ఆర్యన్ ప్రస్తుతం మాంచెస్టన్‌లో నివసిస్తున్నాడు.
‘చిన్నప్పటి నుండి క్రికెట్ నా జీవితంలో భాగమైంది. మానాన్న దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు, కోచ్‌గా ఉన్నప్పుడు నేను చాలా గర్వంగా ఫీలయ్యాను, ఆయన అడుగుజాడల్లో నడవాలని కలలు కన్నాను. క్రీడల పట్ల నా తండ్రికి ఉన్న అభిరుచి, క్రమశిక్షణ, అంకితభావం ఎంతో స్పూర్తినిచ్చాయి. క్రికెట్‌లో స్కిల్స్ మెరుగుపర్చేందుకు నా జీవితాంతం గడిపాను, ఏదో ఒక రోజు నా తండ్రిలాగే దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం వస్తుందని ఆశిస్తున్నాను’ అంటూ తన ఇన్‌స్టాలో అనయ రాసుకొచ్చింది.
తనకు ఇష్టమైన క్రికెట్ వదిలివేస్తానని ఎప్పుడూ అనుకోలేదని ఆర్యన్ పేర్కొన్నాడు. లింగమార్పిడి ద్వారా ట్రాన్స్ ఉమెన్‌గా మారిపోయానని, దీని వల్ల తన శరీరం మొత్తం బాగా మారిపోయిందని చెప్పుకొచ్చాడు. తన కండరాల్లో బలం కూడా తగ్గిపోయిందని, అలాగే అథ్లెటిక్ సామర్థ్యాలను కోల్పోయినట్లు పేర్కొన్నాడు. తనకు ఇష్టమైన క్రికెట్‌ను కోల్పోతున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు.
తండ్రి సంజయ్ బంగర్ తరహాలోనే ఆర్యన్ కూడా క్రికెటర్. ఇస్లాం జింఖానా తరపున అతను క్రికెట్ ఆడాడు. లీసెష్టర్ షైర్ లోని హింక్లే క్రికెట్ క్లబ్‌కు కూడా అతను ఆడాడు. ట్రాన్స్ జెండర్ అథ్లెట్లకు క్రికెట్ ఆడే అవకాశాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి ఇటీవల ఎత్తివేసింది. ఉమెన్స్ క్రికెట్‌లో లింగ మార్పిడి చేయించుకున్న క్రికెటర్లను ఆడనివ్వబోమని గత ఏడాది నవంబర్‌లో ఐసీసీ ప్రకటించింది. ఐసీసీ తీసుకున్న కొత్త నిర్ణయాన్ని ఆర్యన్ తప్పుపట్టారు.