KL Rahul: ల‌క్నోను వీడింది అందుకే.. ఎల్ఎస్‌జీ నుంచి బ‌య‌టకు రావ‌డంపై పెద‌వి విప్పిన కేఎల్ రాహుల్‌!

KL Rahul Breaks Silence On Separation From Lucknow Super Giants

  • తాను స‌రికొత్త ఆరంభాన్ని కోరుకుంటున్నాన‌న్న రాహుల్  
  • భావ‌వ్య‌క్తీక‌ర‌ణ స్వేచ్ఛ ఉన్న‌చోట ఎక్క‌డైనా ఆడాల‌ని అనుకుంటున్నానని వెల్ల‌డి
  • ఈ నేప‌థ్యంలోనే ఐపీఎల్ మెగా వేలంలోకి ప్ర‌వేశించిన‌ట్టు వ్యాఖ్య

ఐపీఎల్ ఫ్రాంచైజీ ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ (ఎల్ఎస్‌జీ)తో విడిపోవ‌డంపై ఎట్ట‌కేల‌కు స్టార్ క్రికెట‌ర్‌ కేఎల్ రాహుల్ పెద‌వి విప్పాడు. లక్నో జ‌ట్టుతో విడిపోవ‌డానికి గ‌ల కార‌ణాన్ని తాజాగా వెల్ల‌డించాడు. తాను స‌రికొత్త ఆరంభాన్ని కోరుకుంటున్నాన‌ని తెలిపాడు. త‌న‌కు భావ‌వ్య‌క్తీక‌ర‌ణ స్వేచ్ఛ ఉన్న‌చోట ఎక్క‌డైనా ఆడాల‌ని అనుకుంటున్నానని పేర్కొన్నాడు. ఐపీఎల్ 2025 తన క్రికెట్‌ను ఆస్వాదించడానికి వేదిక కానుంద‌ని తెలిపాడు. ఇక్క‌డ గొప్ప‌గా రాణించి, టీమిండియా టీ20 జట్టులోకి తిరిగి రావ‌డ‌మే త‌న త‌దుప‌రి ల‌క్ష్య‌మ‌ని రాహుల్ చెప్పుకొచ్చాడు. 

కాగా, 2022 టీ20 ప్రపంచ కప్ తర్వాత రాహుల్ భార‌త జ‌ట్టు తరపున పొట్టి ఫార్మాట్‌లో ఆడలేదు. 2016లో టీ20ల్లో అరంగేట్రం చేసినప్పటి నుంచి ఇప్పటివరకు టీమిండియా తరపున 72 టీ20లు ఆడాడు. 37.75 సగటు, 139.12 స్ట్రైక్ రేట్‌తో 2,265 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, 22 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 

ఇక ఐపీఎల్‌ 2022 నుంచి 2024 సీజన్‌ వరకు రాహుల్ లక్నో సూపర్ జెయింట్స్‌కు కెప్టెన్‌గా ఉన్నాడు. అత‌ని సార‌థ్యంలోనే జట్టు 2022, 2023 సీజన్‌లలో ప్లేఆఫ్‌లకి వెళ్లింది కూడా. ఈ మూడు సీజ‌న్ల‌లో క‌లిపి రాహుల్ 1,410 ర‌న్స్ చేశాడు. కాగా, గ‌త సీజ‌న్‌లో మ్యాచ్‌లు ఓడిన‌ప్పుడు సార‌థి రాహుల్‌తో ఎల్ఎస్‌జీ య‌జ‌మాని సంజీవ్ గోయెంకా కోపంతో మాట్లాడిన విష‌యం తెలిసిందే. దాంతో రాహుల్ ల‌క్నో నుంచి బ‌య‌ట‌కు రావ‌డం ఖాయ‌మంటూ పుకార్లు పుట్టుకొచ్చాయి. వాటిని నిజం చేస్తూ ఫ్రాంచైజీ అత‌డిని ఈసారి వేలానికి వ‌దిలేసింది. 

ఈ నెల 24, 25 తేదీల్లో జెడ్డాలో జరగనున్న ఐపీఎల్‌ 2025 మెగా వేలంలో తన అదృష్టాన్ని ప‌రీక్షించుకోబోతున్నాడు. ఈ నేప‌థ్యంలో రాహుల్ మాట్లాడిన వీడియో ప్రోమోను తాజాగా స్టార్ స్పోర్ట్స్ త‌న ఎక్స్‌ ఖాతాలో పోస్ట్ చేసింది.

"నేను కొంతకాలం టీ20 జట్టుకు దూరంగా ఉన్నాను. నా ఆట గురించి నాకు తెలుసు. తిరిగి జ‌ట్టులోకి రావడానికి ఏం చేయాలో కూడా నాకు బాగా తెలుసు. దానికి నేను ఈ ఐపీఎల్‌ సీజన్‌ను వేదికగా మార్చుకోవాల‌నుకుంటున్నాను. ఇక్క‌డ‌ నా క్రికెట్‌ను ఆస్వాదించి, భారత టీ20 జట్టులోకి తిరిగి రావడమే నా లక్ష్యం" అని రాహుల్ చెప్పాడు.

అలాగే తాను మెగా వేలంలో ఎందుకు పాల్గొంటున్నాడో కూడా తెలిపాడు. "నేను స‌రికొత్త ఆరంభాన్ని కోరుకుంటున్నా. దాని కోసం కొత్త జ‌ట్టుకు ఆడాలనుకుంటున్నాను. అక్కడ నాకు కొంత స్వేచ్ఛ లభిస్తుంది. కొత్త‌ జట్టు కాబ‌ట్టి అక్కడ వాతావరణం ఏదైనా తేలికగా ఉంటుంది. నాకు భావ‌వ్య‌క్తీక‌ర‌ణ స్వేచ్ఛ ఉన్న‌చోట ఎక్క‌డైనా ఆడాల‌ని అనుకుంటున్నా" అని రాహుల్ చెప్పుకొచ్చాడు. 

కాగా, ప్ర‌స్తుతం అత‌డు ఈ నెల‌ 22న పెర్త్‌లో ఆస్ట్రేలియాతో జ‌రిగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్ కోసం సిద్ధ‌మ‌వుతున్నాడు. ఇక్క‌డ అత‌నికి ఓపెన‌ర్‌గా అవ‌కాశం ద‌క్క‌నుంది. ఎందుకంటే తొలి మ్యాచ్‌కు కెప్టెన్ రోహిత్ శ‌ర్మ వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో దూరం కానున్నాడు. అత‌ని స్థానంలో రాహుల్... యశస్వి జైస్వాల్‌తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించ‌నున్నాడు.

  • Loading...

More Telugu News