Manipur: భద్రతా బలగాల ఎదురుకాల్పుల్లో 11 మంది కుకీ తిరుగుబాటుదారుల మృతి

11 Kuki insurgents were killed after a gunfight broke out with security forces in Manipur

  • ఇద్దరు సీఆర్‌పీఎఫ్ జవాన్లకు గాయాలు
  • ఒక పోలీస్ స్టేషన్, అక్కడికి సమీపంలోనే ఉన్న సీఆర్‌పీఎఫ్ క్యాంప్ లక్ష్యంగా కుకీ మిలిటెంట్ల కాల్పులు
  • ప్రతిస్పందించి కాల్పులు జరిపిన భద్రతా బలగాలు
  • మణిపూర్‌లో మరోసారి ఉద్రిక్తత

ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో కీలకమైన పరిణామం చోటుచేసుకుంది. జిరిబామ్ జిల్లాలో భద్రతా బలగాల ఎదురుకాల్పుల్లో 11 మంది కుకీ తెగ తిరుగుబాటుదారులు చనిపోయారు. ఇద్దరు సీఆర్‌పీఎఫ్ జనాన్లు గాయపడ్డారు. జిరిబామ్ జిల్లాలోని జకురాడోర్ కరోంగ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. నిన్న (సోమవారం) మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో అనేక మంది సాయుధ మిలిటెంట్లు భద్రతా బలగాల దుస్తుల్లో ఆ ప్రాంతానికి వచ్చారు. బోరోబెక్రా పోలీస్ స్టేషన్‌తో పాటు అక్కడికి సమీపంలోనే ఉన్న సీఆర్‌పీఎఫ్ క్యాంపుపై ఆగకుండా కాల్పులు మొదలుపెట్టారు. పోలీస్ స్టేషన్‌కు 100 మీటర్ల దూరంలో ఉన్న స్థానిక మార్కెట్‌పై కూడా కాల్పులు జరిపారు. కొన్ని ఇళ్లపై దాడి చేయడంతో పాటు అనేక దుకాణాలను తగులబెట్టారు. దీంతో భద్రతా బలగాలు భారీగా ఎదురుకాల్పులు మొదలుపెట్టాయి.

ఈ ఎదురుకాల్పుల ఘటన తర్వాత పోలీసు స్టేషన్‌ రిలీఫ్ క్యాంపులో ఉన్న ఐదుగురి ఆచూకీ తెలియడం లేదని, వారి కోసం అన్వేషిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు. వీరిని కుకీ మిలిటెంట్లు కిడ్నాప్ చేశారా? లేక దాడి ప్రారంభమైన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లారా? అనేది తెలియరాలేదని అన్నారు. ఈ ఘటనపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోందని చెప్పారు.

కాగా ఘటన జరిగిన జిరిబామ్ జిల్లాలో బీఎన్ఎస్ఎస్‌లోని సెక్షన్ 163 కింద నిషేధాజ్ఞలు అమల్లోకి వచ్చాయి. దీంతో ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమికూడడానికి వీల్లేదు. కొందరు సంఘవ్యతిరేక శక్తులు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడి ప్రజాశాంతికి విఘాతం కలిగించడం లేదా అల్లర్లు సృష్టించే అవకాశం ఉందని నోటిఫికేషన్‌లో పోలీసులు పేర్కొన్నారు. మరోవైపు ఎదురుకాల్పుల ఘటన తర్వాత ఇంఫాల్ పశ్చిమ, తూర్పు జిల్లాల్లోని వివిధ గ్రామాల్లో హింసాత్మక ఘర్షణలు చోటుచేసుకున్నట్టు కథనాలు వెలువడుతున్నాయి.

  • Loading...

More Telugu News