Kasturi: ముందస్తు బెయిల్ కోసం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించిన కస్తూరి

Kasturi files anticipatory bail plea in Madras High Court

  • తెలుగు వారిని కించపరిచేలా కస్తూరి వ్యాఖ్యలు
  • తమిళనాడులో పలు చోట్ల కేసులు నమోదు
  • ఇంటికి తాళం వేసి పరారైన కస్తూరి
  • నేడు మద్రాస్ హైకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ దాఖలు 

ప్రముఖ నటి కస్తూరి ఇటీవల తెలుగు ప్రజలపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం అయ్యాయి. తమిళనాడులో స్థిరపడిన తెలుగు ప్రజలపై ఆమె అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ... చెన్నై, మధురై నగరాల్లో ఆమెపై పరువునష్టం కేసులు నమోదయ్యాయి. 

నిన్న పోలీసులు చెన్నైలోని కస్తూరి నివాసానికి వెళ్లారు. ఆమెకు నోటీసులు ఇచ్చేందుకు వెళ్లిన పోలీసులకు, ఆమె ఇంటికి తాళం వేసి ఉండడం కనిపించింది. దాంతో ఆమె పరారీలో ఉన్నట్టు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో, నేడు ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. 

పరువునష్టం కేసులో కస్తూరి ముందస్తు బెయిల్ కోరుతూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. తనపై తప్పుడు ఉద్దేశాలతో ఈ కేసు పెట్టారని ఆమె ఆరోపించారు. ఈ పిటిషన్ పై జస్టిస్ ఆనంద్ వెంకటేశ్ నేతృత్వంలోని ధర్మాసనం రేపు (నవంబరు 12) విచారించనుంది. 

తమిళనాడు బ్రాహ్మణులకు మద్దతుగా నవంబరు 3న హిందూ మక్కల్ కట్చి సంస్థ చెన్నైలో నిరసన ప్రదర్శన నిర్వహించింది. ఈ కార్యక్రమానికి కస్తూరి కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమిళనాడులోని తెలుగు ప్రజలపై నోరు పారేసుకున్నారు. దాంతో తమిళనాడు రాష్ట్రంలో పలు చోట్ల కస్తూరిపై కేసులు నమోదయ్యాయి. తన వ్యాఖ్యల పట్ల కస్తూరి ఇప్పటికే క్షమాపణలు కూడా చెప్పారు. అయినప్పటికీ, తమిళనాడులోని తెలుగు సంఘాలు వెనక్కి తగ్గడం లేదు. 

కస్తూరి ఇటీవల లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రచారం చేశారు. అయితే, ఆమె తెలుగు వారిపై చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఖండించింది. 

ఇంతకీ కస్తూరి ఏమన్నారంటే... "దాదాపు 300 ఏళ్ల కిందట తమిళనాడులో మహారాజుల అంతఃపురాల్లో స్త్రీలకు సేవలు చేసేందుకు వచ్చిన వారే తెలుగువారు... ఇప్పుడు వారంతా తమది తమిళ జాతి అని పెద్ద మాటలు మాట్లాడుతున్నారు" అంటూ వ్యాఖ్యానించారు. ఆమె వ్యాఖ్యలపై తమిళనాడులో స్థిరపడిన తెలుగువారు భగ్గుమంటున్నారు.

  • Loading...

More Telugu News