Vampire bats: ట్రెడ్ మిల్ పై రక్త పిశాచి గబ్బిలాల పరుగు.. మన మేలు కోసమే.. ఎందుకలా?
- కేవలం రక్తం మాత్రమే తాగి బతికే వాంపైర్ బ్యాట్స్
- సరైన పోషకాలు లేకుండా వాటికి శక్తి ఎలా వస్తుందని శాస్త్రవేత్తల పరిశోధన
- పోషకాహార లోపం, ఔషధాల రూపకల్పనకు తోడ్పడే ప్రయోగం
గబ్బిలాలను చూస్తే చాలా మంది భయపడతారు. వాటి ఆకారం, రాత్రిపూట తిరగడం, చిన్నప్పుడు మన పెద్దవాళ్లు చెప్పే కథలు వంటివి దానికి కారణం. ఇలాంటి గబ్బిలాలలో కేవలం జంతువుల రక్తం తాగి బతికేవి ‘వాంపైర్ బ్యాట్స్’... అంటే రక్తపిశాచి గబ్బిలాలు అనొచ్చు. శాస్త్రవేత్తలు ఆ గబ్బిలాలను ఓ చిన్నపాటి ట్రెడ్ మిల్ పై పరుగెత్తిస్తున్నారు. మనకు మేలు చేసే కొన్ని అంశాలను గుర్తించేందుకు ప్రయోగం చేస్తున్నారు.
అన్ని రకాల పోషకాలు అందకుంటే...
మామూలుగా జంతువులేవైనా బతకడానికి శక్తి అవసరం. తినే ఆహారం ద్వారా ఈ శక్తి అందుతుంది. దాదాపు అన్ని రకాల జంతువులు కూడా కొంచెం అటూ ఇటూగా శరీరానికి అన్ని పోషకాలు అందించే ఆహారం తీసుకుంటాయి. కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, విటమిన్లు, కొవ్వు పదార్థాలు, అమైనో యాసిడ్స్ వంటివన్నీ ఆ ఆహారం ద్వారా శరీరానికి అందేలా చూసుకుంటాయి. అన్ని పోషకాలు అందకపోతే... ఆరోగ్యం దెబ్బతింటుంది. వివిధ వ్యాధులు వస్తాయి. ఆ జీవులు కృశించిపోతాయి. ఈ విషయంలోనే వాంపైర్ బ్యాట్స్ లో తేడాను శాస్త్రవేత్తలు గుర్తించారు.
వాంపైర్ గబ్బిలాలపై ప్రయోగం ఎందుకు?
వాంపైర్ గబ్బిలాలు కేవలం జంతువుల రక్తం మాత్రమే తాగుతూ బతికేస్తాయి. వేరే ఆహారం ఏదీ తీసుకోవు. అలాంటప్పుడు వాటికి పోషకాహార లోపం రావాలి కదా, సాధారణంగా జంతువుల్లో కార్బోహైడ్రేట్ల ద్వారా శక్తి ఉత్పన్నం అవుతుంది. రక్తంలో కార్బోహైడ్రేట్లు చాలా తక్కువ. ప్రొటీన్లు, అమైనో యాసిడ్స్ ఎక్కువ. మరి వాటిలో శక్తి ఎలా ఉత్పత్తి అవుతుందన్న ప్రశ్న తలెత్తింది. ఇది తేల్చేందుకే టొరొంటో స్కార్బోరో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు శాస్త్రవేత్తలు వాంపైర్ బ్యాట్స్ పై ప్రయోగం మొదలుపెట్టారు.
ట్రెడ్ మిల్ పై పరుగు పెట్టించడం ఎందుకు?
జీవులేవైనా పరుగెత్తినప్పుడు వాటి శరీరంలో శక్తి వేగంగా ఖర్చవుతుంది. దీనితో ఆహారం నుంచి శక్తి ఉత్పత్తి పెరుగుతుంది. అందుకే శాస్త్రవేత్తలు వాంపైర్ బ్యాట్ లను ప్రత్యేకమైన ట్రెడ్ మిల్ పై పరుగులు పెట్టించారు. వాటి శరీరంలో శక్తి ఎలా ఉత్పత్తి అవుతోంది, ఏ రకమైన పోషకాల నుంచి వస్తోందన్నది పరిశీలించారు.
ఈ ప్రయోగంతో మనుషులకు లాభమేంటి?
వాంపైర్ గబ్బిలాల శరీరం పోషకాలను అవసరానికి తగినట్టుగా ఎలా వినియోగించుకుంటుందో పూర్తిగా తేల్చితే... మనుషులలో పోషకాహార సమస్యలకు చెక్ పెట్టే విధానాలు, ఔషధాల రూపకల్పనకు తోడ్పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సాధారణంగా మనలో ఎంజైముల ఉత్పత్తికి అమైనో యాసిడ్స్ దోహదం చేస్తాయి. కానీ వాంపైర్ బ్యాట్స్ లో అవి నేరుగా జీర్ణమై శక్తిని ఇస్తున్నాయి. ఈ విధానాన్ని లోతుగా అధ్యయనం చేస్తే... శరీరంలో, ఆహారంలో మార్పులు, తగిన మందుల తయారీ చేపట్టవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.